ఏపీ సచివాలయంలో మూడు గేట్లకు అడ్డంగా గోడలు నిర్మించడం చర్చకు దారితీసింది. సచివాలయం చుట్టూ ఆరు గేట్లున్నాయి. అందులో నాలుగు గేట్లు సచివాలయ నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయగా, మరో రెండు గేట్లను వాస్తు కోసమంటూ ఏడాదిన్నర కిందట గత ప్రభుత్వం ప్రత్యేకించి అమర్చింది. అయితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ రెండు గేట్లతో పాటు మరో గేటుకి అడ్డంగా గోడల నిర్మాణానికి పూనుకుంది. సచివాలయానికి ఉత్తరం దిశగా ఉన్న గేటుకు, దానికి ఎదురుగా దక్షిణ దిశలో మొదటి బ్లాకు పక్కనున్న గేటుకు అడ్డంగా గోడలు నిర్మించారు. అలాగే, సచివాలయం వైపు నుంచి అసెంబ్లీకి వెళ్లే అసెంబ్లీ అయిదవ గేటుకు కూడా అడ్డంగా గోడకట్టారు. ఐరన్ గేట్లను అలానే ఉంచి ఈ నిర్మాణాలు చేపట్టడం విశేషం.
భద్రతాపరమైన కారణాల నేపద్యంలో గేట్లను మూసి వేస్తున్నామని అధికారులు అంటుండగా, కాదు వాస్తు కోసమే అయి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకాలం లేనిది, భద్రతాపరమైన ఇబ్బందులు ఇప్పుడు సచివాలయానికి కొత్తగా ఏం వచ్చాయని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.