English | Telugu
నెలరోజుల్లో ఏపీ స్ధానిక ఎన్నికలు... రెండ్రోజుల్లో నోటిఫికేషన్
Updated : Mar 4, 2020
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నెలరోజుల్లోగా పూర్తి చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలతో రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఎన్నికల తేదీలపై ప్రతిపాదనలు కూడా ఎన్నికల సంఘానికి అందాయి. వీటిపై ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే బుధవారం కేబినెట్ భేటీలో వీటిని ఖరారు చేసే అవకాశముంది. మరోవైపు ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన నిర్ణయించాయి.
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన రిజర్వేషన్ల ఖరారు వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వులు కూడా వెలువడటంతో నెల రోజుల్లోపు ఈ ప్రక్రియను ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కొన్ని తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు ఉంచింది. వీటి ప్రకారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21న, పురపాలక ఎన్నికలను 24న, గ్రామ పంచాయతీ ఎన్నికలను 27న నిర్వహించేందుకు ప్రభుత్వం తన సంసిద్ధతను తెలియజేసింది. అయితే వీటిపై ఈసీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోతే వీటిని బుధవారం కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఈ నెల 7న, పురపాలికలకు ఈ నెల 10న, గ్రామ పంచాయతీ ఎన్నికలకు 15న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఏపీలో మొత్తం 21843 గ్రామ పంచాయతీలు ఉండగా, 74 పురపాలక సంఘాలు, మరో 16 మున్సిపల్ కార్పోరేషన్లు ఉన్నాయి. వీటికి దశల వారీగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లోపు స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన రూ.3400 కోట్లు, పురపాలక ఎన్నికలు నిర్వహించకపోతే మరో రూ.1400 కోట్ల 14వ ఆర్దిక సంఘం నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం ఎలాగైనా నెలాఖరు లోగా ఈ ప్రక్రియ ముగించాలని భావిస్తోంది.