English | Telugu
కరోనాకు తోడు ఫంగస్ ఇన్ఫెక్షన్.. సోకిందంటే అత్యంత ప్రమాదమే
Updated : Dec 12, 2020
ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న సామాన్య జనాన్ని తాజాగా మరో ముప్పు వణికిస్తోంది. కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లు మనిషికి సోకితే దాని ప్రభావంతో తీవ్ర నష్టం జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతారు. అయితే తాజాగా కరోనా బాధితుల్లో కనిపిస్తున్న ఒక అరుదైన ఫంగస్ ఇన్ఫెక్షన్ వారి కంటిచూపుతో పాటు ప్రాణాలను కూడా హరించి వేస్తోందని భారత వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. "మ్యూకార్ మైకోసిస్" అని పిలవబడుతున్న ఈ అరుదైన ఫంగస్ కరోనాతో బాధపడుతున్న పేషంట్ల పైనేకాకుండా, కరోనా నుండి కోలుకున్నవారిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోందని వారు గుర్తించారు.
అహ్మదాబాద్ కు చెందిన ఆక్యులర్ ట్రామా సర్జన్ పార్థ్ రాణా దృష్టిలోకి ఇలాంటివి పలు కేసులు వచ్చాయి. ఈ ఫంగస్ సోకిన వారిలో దాదాపు 50 శాతం మంది మరణించారని, అంతేకాకుండా దీని నుండి ప్రాణాలతో బతికి బయటపడిన వారి కంటి చూపు పోయిందని పార్థ్ రాణా తెలిపారు. ఈ ఫంగస్ సోకినవారిలో కనుగుడ్లు పెద్దవిగా మారి, పొడుచుకువచ్చినట్టుగా మారిపోయాయని అయన తెలిపారు. సాధారణంగా కరోనా సోకని వారిలో "మ్యూకార్ మైకోసిస్" వ్యాప్తి చెందడానికి 15 నుంచి 30 రోజుల సమయం తీసుకుంటుందని, అయితే కరోనా రోగులకు మాత్రం ఇది 2 నుంచి 3 రోజుల్లోనే సోకుతోందని అయన అన్నారు.
ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ అతుల్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దృష్టికి గత మూడు నెలల్లో ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు 19 వచ్చాయని అయన తెలిపారు. కరోనా వ్యాప్తి లేని సమయంతో పోల్చితే ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు 4 నుండి 5 రెట్లు ఎక్కువగా ఉందని అయన తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ సోకితే రోగి ప్రాణం పోయేందుకు 50 శాతం అవకాశాలు ఉన్నాయని, అందుకే దీనిపై ఆసుపత్రుల యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అయన స్పష్టం చేశారు.