English | Telugu
కడప జిల్లాలో టీడీపీ ఖాళీ
Updated : Mar 11, 2020
ఏపీలో టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకి తమ్ముళ్లు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు కీలక నేతలు, చంద్రబాబు సన్నిహితులు వైసీపీలోకి జంప్ అయ్యారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో జాయిన్ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ రామసుబ్బారెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డి వెళ్లిపోవడంతో కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.
రామసుబ్బా రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోకవర్గంలో పలు మార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. టీడీపీని వీడాలని కొంతకాలంగా భావిస్తున్నారు. కార్యకర్తలు, అనుచరులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహించారు. పార్టీ మార్పుపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. చివరకు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ భవిష్యత్తుపై జగన్ భరోసా ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి పార్టీ మారినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి రామసుబ్బారెడ్డి ఎంట్రీతో జమ్మలమడుగు నియోజకవర్గ రాజకీయం మరో కీలక మలుపు తిరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతల్ని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను వైసీపీలో జాయిన్ చేసుకుంది. ఇప్పుడు రామసుబ్బారెడ్డి కూడా అధికార పార్టీలోకి వెళ్లారు.
రామసుబ్బారెడ్డి ఎన్నో ఏళ్లగా టీడీపీలోనే ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని వీడతారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆయన వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. పార్టీ మారడం ఖాయమని ఊహాగానాలు కూడా వినిపించాయి.
ఎప్పటి నుంచో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిలు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులు కోల్డ్ వార్ నడిచింది. రంగంలోకి దిగిన చంద్రబాబు ఇద్దరు నేతలతో చర్చలు జరిపి రాజీ చేశారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు.. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు. తర్వాత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. రామసుబ్బారెడ్డి కూడా వైసీపీలోకి వెళ్లారు. , కడపలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మొత్తంగా ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడడంతో కడప జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రామసుబ్బారెడ్డి లాంటి కీలక నేత వైసీపీ కండువా కప్పుకోవడం చంద్రబాబుకు షాకింగ్‌గా మారింది.