English | Telugu

టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమవ్వలేదా?.. రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆగస్టు 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరగనుంది. దీంతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెర పడనుంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కానసాగుతుందా? లేక కూలిపోతుందా? అనే విషయం తేలనుంది. కాంగ్రెస్ కి మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడుతుంది. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి జైసల్మేర్ కు తరలిస్తోంది.

మరోవైపు బీఎస్పీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ లో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేల చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. ఇప్పటికే వారి విలీనాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ హై కోర్ట్ ని ఆశ్రయించింది. బీజీపీ కూడా ఈ విలీనాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడాన్ని ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని తప్పుపడుతున్నారని, టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీలో విలీనమయ్యారని.. ఈ విలీనాన్ని మాత్రం బీజేపీ సరైందని వాదిస్తుందని విమర్శించారు. రాజస్థాన్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనాన్ని మాత్రం తప్పంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.