English | Telugu

పేద బాలికలకు స్మార్ట్ ఫోన్లు

ఆన్ లైన్ క్లాస్ లకు హజరయ్యేందుకు
ఉచితంగా అందిస్తున్న పంజాబ్ ప్రభుత్వం

కరోనా వ్యాప్తి కారణంగా దేశంలోని విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రకటించే పరిస్థితి లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం విద్యార్థులకు నష్టపోకుండా ఆన్‌లైన్ క్లాసులు ఏర్పాటుచేస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ సదుపాయాలు లేని పేద విద్యార్థుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు అందచేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. తమ రాష్ట్రంలోని పేద బాలికలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందిస్తోంది. అందుకోసం 50 వేల స్మార్ట్‌ఫోన్లను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వీటిని అందిస్తారు.

ఇందుకు సంబంధించి రాష్ట్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘50,000 స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను వినేందుకు ఇవి ఉపయోగపడతాయి. రాష్ట్రంలో 9 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న బాలికలందరికీ ఈ ఫోన్లు అందజేయబడతాయి’ అని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.

గతంలో మన రాష్ట్రంలో బాలికల డ్రాప్ అవుట్స్ ను అరికట్టాలని బాలికలకు సైకిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం మారిన పరిస్థితులతో పంజాబ్ లో స్మార్ట ఫోన్లు ఇస్తున్నారు.