English | Telugu

ఎమ్మెల్సీ బరిలో కోదండరాం..!!

పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) నిర్ణయించింది. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి కోదండరాం బరిలోకి దిగితే బాగుంటుందని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, ఏ నిర్ణయమైనా సమష్టిగా తీసుకోవాలని కోదండరాం స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా మరోసారి సమావేశమై అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఈలోగా ఇతర పార్టీలు, సంఘాల నేతల అభిప్రాయాలు, మద్దతు సేకరించాలని కోరారు.

ఇక 2018 ఎన్నికల్లో తాము పోటీ చేసిన దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. దానిపై నివేదిక తయారు చేసేందుకు కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేసిఆర్ సర్కార్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. దేని కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ కల కేసిఆర్ తో సాకారం కావట్లేదని చెబుతూ.. గత ఎన్నికలకు ముందు టీజేఎస్‌ పార్టీని స్థాపించారు. అయితే, మహాకుటమి పొత్తులో భాగంగా కొద్ది స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన టీజేఎస్‌.. ఏ మాత్రం ప్రభావం చూపలేకపాయింది. అయితే, కోదండరాం మాత్రం.. కేసిఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికపై దృష్టి పెట్టడం చూస్తుంటే.. కోదండరాం కాస్త దూకుడు పెంచినట్టు కనిపిస్తున్నారు. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఏ మేరకు ప్రభావితం చూపిస్తారో.