English | Telugu

దళితుడికి పూజలు చేయనన్న గుడి పూజారి అరెస్ట్... 

జనగామ జిల్లా కేంద్రంలోని అభ‌యాంజ‌నేయ స్వామి ఆల‌యంలో దళితుడికి పూజలు చేయనని ఆలయ పూజారి వెనక్కి పంపడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన పలు దళిత సంఘాలు గుడి వద్ద ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దేవాలయ పూజారి అభయాంజనేయ శర్మను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

దళిత వర్గానికి చెందిన భాస్కర్, సంధ్య దంపతులు తమ కుమారుడికి శాంతి పూజ చేయించేందుకు శుక్రవారం స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు. పూజ చేయాలని ఆలయ పూజారిని కోరగా.. వారు దళిత వర్గానికి చెందినవారని తెలుసుకుని.. దళితులకు అసలు ఆలయంలో ప్రవేశం లేదని, పూజలు కూడా చేయమని పూజారి చెప్పడంతో ఆ దంపతులు వెనక్కి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. దళితులపై ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా దళిత సంఘాలు ప్రశ్నించాయి. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని పూజ చేయడానికి నిరాకరించిన పూజారిని అరెస్టు చేశారు.