English | Telugu
కరెంటు చార్జీల మోత.. ఏపీలో భారీగా పెరగనున్న యూనిట్ చార్జీ
Updated : Dec 5, 2019
ఏపీలో కరెంట్ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతుంది. కొన్ని వర్గాల పై విద్యుత్ చార్జీల భారం మోపాలని డిస్కంలు ప్రతిపాదించాయి. చార్జీల పెంపు ద్వారా వచ్చే ఏడాది రూ.1373 కోట్ల రూపాయలు అదనంగా సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆదాయం అవసరాల నివేదిక టారిఫ్ ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ కమిషన్ సమర్పించాయి. చార్జీల పెంపు ప్రతిపాదన నుంచి 500 ల యూనిట్లలోపు గృహ వినియోగదారులను మినహాయించారు. ప్రస్తుతం 2 డిస్కంలకు కరెంటు చార్జిలు ఇతరత్రా మార్గాల్లో రూ.30,400 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.44,840 కోట్ల నిధులు అవసరముంది. చార్జీల పెంపు ద్వారా అదనంగా రూ.1373 కోట్లు సమకూర్చుకోవాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఆ తర్వాత కూడా ఆదాయానికి అవసరానికి మధ్య రూ.13,000 ల కోట్ల రూపాయల వ్యత్యాసముంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా దీనిని పూడ్చుకోగలమని ఈ సంస్థలు రెగ్యులేటరీ కమిషన్ కు నివేదించాయి.
500 యూనిట్ లకు మించి విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు యూనిట్ కు 90 పైసలు పెంచాలని ప్రతిపాదించారు. ఏపీలో కోటిన్నర మంది గృహ వినియోగదారులు ఉండగా ఇందులో నెలకు 500 ల యూనిట్లకు మించి విద్యుత్ వాడేవారు 2 శాతానికి మించి ఉండరని అధికార వర్గాలు చెబుతున్నాయి. నెలకు 200 ల యూనిట్లలోపు వినియోగించే వారికి స్వల్ప ఊరటను ప్రతిపాదించారు. ఇప్పటి దాకా వారికి గత సంవత్సరంలో వినియోగించిన విద్యుత్ ను బట్టి స్లాబ్ ను నిర్ణయించేవారు. కొత్త ప్రతిపాదనలతో ఏ నెల వినియోగంలో ఆ నెల యూనిట్ల ఆధారంగానే స్లాబ్ వుంటోందని ప్రతిపాదించారు. దీని వల్ల రాష్ట్రం మొత్తం మీద విద్యుత్ సంస్థలకు రూ.60 కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గుతోందని తమ అంచనాల్లో ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంలో చార్జీల భారం ఎక్కువగా ఉందని మీ కరెంట్ వద్దని రైల్వే పేర్కొన్న ఆ సంస్థకు నచ్చజెప్పి గిట్టుబాటు టారిఫ్ ను ఈఆర్సీ ఇప్పించింది. ఈ దఫా మాత్రం రైల్వేలకూ చార్జీలు పెంచాల్సిందేనని డిస్కంలు ప్రతిపాదించాయి.
పెంపు ప్రతిపాదనల్లో ప్రధానంగా 10 కేటగిరీల్లో లక్ష్యంగా చేసుకున్నారు. సాగు నీటి ఎత్తిపోతల పథకాలు, హెచటీ వాణిజ్య సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, స్థానిక సంస్థలు, తాగు నీటి సరఫరా సంస్థలు, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే స్థానిక సంస్థలపై 24.92 శాతం దాకా అదనపు భారం పడుతుంది. రైల్వేపై ఏకంగా 56.67 శాతం, పౌల్ట్రీ రంగంపై 14.42 శాతం, ఎత్తిపోతల పథకాలపై 23.26 శాతం భారం పడనుంది.ఇక అత్యధికంగా క్యాటగిరి-4 లో చార్జీల పెంపుతో 575 కోట్ల దాకా రాబట్టనున్నారు. క్యాటగిరీ-5 పై 302 కోట్ల మేర భారం పడుతోందని లెక్కలు తేల్చారు. మరోవైపు డిస్కంల పై విద్యుత్ కొనుగోళ్ల భారం కూడా పెరిగింది. 2019-20 లో ఈఆర్సీ ఆమోదించిన మేరకు కరెంటు కొనుగోలు వ్యయం యూనిట్ కు 3 రూపాయల 98 పైసలు ఉండగా, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో 4 రూపాయల 72 పైసలకు చేరింది. విద్యుత్తు కొనుగోళ్లకు ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2019-20 లో రూ.11,402 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.12,439 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒక యూనిట్ ను సరఫరా చేయడానికి అయ్యే ఖర్చు 2019-20 లో 6 రూపాయల 18 పైసలు కాగా 2020-21 లో 7 రూపాయల 36 పైసలుగా ఉంటుందని తేల్చారు. ఏఆర్ఆర్ లో పేర్కొన్న లోటును ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరిస్తే చార్జీల పెంపు ఉండదు. అయితే విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదనలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం టారిఫ్ ఉత్తర్వులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తెలిపింది.