English | Telugu
కనకదుర్గమ్మ ఆలయ ఆవరణలో వైసీపీ సమావేశాలు.. మండిపడుతున్న భక్తులు, ప్రతిపక్షాలు
Updated : Nov 6, 2020
తాజాగా ఈ విషయం పై టీడీపీ నేత బోండా ఉమా స్పందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ గుడిని వైసీపీ పార్టీ కార్యాలయంగా వాడుకోవటం దుర్మార్గమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడిలో వైసీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులతో మీటింగ్ పెట్టిన దేవాదాయ మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించాలని అయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయలంటే వైసీపీ ప్రభుత్వం ఏంటో చులకనగా చూస్తోందని అయన మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 17నెలల్లోఅనేక దేవాలయాలను ద్వంసం చేశారన్నారు. దేవాలయాలపై జరిగిన దాడిలో ఇంతవరకు ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదని అయన అన్నారు. అంతర్వేది రథం తగలబెట్టిన కేసు సీబీఐకి ఇచ్చామన్నారని...కానీ ఇంత వరకు ఆ కేసు అతీ గతీ లేదని విమర్శించారు. అసలు ఆ కేసు సీబీఐకి ఇచ్చారా లేదా అన్నది కూడా తమకు అనుమానమే అని బొండా ఉమా వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉండగా దుర్గమ్మ ఆలయంలో అవినీతి జరుగుతోందంటూ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అది అమ్మవారి ఆలయమా?... లేక వైసీపీ పార్టీ కార్యాలయమా? అని అయన ప్రశ్నించారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో రాజకీయ సమావేశాలా? అని అయన నిలదీశారు. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని అయన హితవు పలికారు. ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని... ఆలయ ప్రతిష్టను పెంచడానికా లేక దిగజార్చడానికా చైర్మన్ పదవి సోమినాయుడు గారు? అని అయన ప్రశ్నించారు. అక్కడ జరిగే అవినీతి మీద ఎలాగో స్పందించరని.. కనీసం ఆలయ సాంప్రదాయాలను తమ పార్టీ నేతలు మంటగలుపుతున్నా స్పందించరా సీఎం గారు? అని మహేష్ ప్రశ్నించారు.