English | Telugu

ఆగస్టు 5న రామమందిరానికి భూమి పూజ

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మందిర నిర్మాణానికి అయోధ్యలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దశాబ్దాల కాలం పాటు కోర్డులో ఉన్న రామమందిర అంశం ఒక కొలిక్కిరావడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ చేయడానికి ముహుర్తం నిర్ణయించారు. మూడు అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో అయోధ్య రామ మందిరం డిజైన్ రూపొందించారు.

ఆగ‌స్టు 5వ తేదీన ఆల‌య నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారు. దాదాపు 250 మంది ముఖ్య‌మైన నేత‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు త‌మ ఇంటి ముందు దీపాల‌ను వెలిగించాల‌ని ఇప్ప‌టికే విశ్వ హిందూ ప‌రిష‌త్ పిలుపునిచ్చింది.

ఆలయ నిర్మాణ స్థలం మొత్తం 67ఎకరాలు కాగా అందులో పది ఎకరాల విస్తీర్ణంలో మూడంతస్తులో ఆలయ నిర్మాణం జరుగుతుంది. మిగతా 57 ఎకరాల స్థలంలో ఆలయ కాంప్లెక్స్ నిర్మిస్తామని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ప్రకటించింది. శ్రీ‌రాముడి జీవితంలోని ప‌లు ముఖ్య‌మైన ఘ‌ట్టాల థీమ్‌తో పార్కును నిర్మిస్తారు. ఆలయ స్థ‌లం తవ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన ప‌లు వ‌స్తువుల‌ను సందర్శనకు ఉంచేలా మ్యూజియం నిర్మిస్తారు. గోశాల‌, ధ‌ర్మ‌శాల, ఇత‌ర చిన్న చిన్న ఆల‌యాల‌ను కూడా ఆల‌య ప్రాంగ‌ణంలో నిర్మించ‌నున్నారు. వీటిలో పాటు 27 న‌క్ష‌త్ర వృక్షాల‌తో, అరుదైన మొక్కలతో వాల్మికీ వనం పెంచుతారు. ట్ర‌స్టు స‌భ్యులు ప్ర‌స్తుతం రామ మందిర నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.