English | Telugu
కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో పిటిషన్
Updated : Jul 22, 2020
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్ పై విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది. ఈ విషయంలో అవసరమైన పాలనాపరమైన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్ ను న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని చెన్నై ద్విసభ్య గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ కోరింది.
కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేముల ఘాట్ రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ పై చెన్నై బెంచ్ లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండానే 21వేల కోట్ల రూపాయల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పిటషన్ తరపు న్యాయవాది బెంచ్ ముందు వివరించారు. అనుమతులు తీసుకునే వరకు విస్తరణ పనులు ఆపాలని కోరారు. అయితే ఇదే అంశంపై ఢిల్లీలోని ఎన్జీటీ ప్రధాన బెంచ్ లోనూ విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.