English | Telugu
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్! నిబంధనలు తొలగించిన కేంద్రం
Updated : Nov 6, 2020
ఇతర సర్వీస్ ప్రొవైడర్‌ల కోసం టెలికాం విభాగం అతి పెద్ద సంస్కరణ చేపట్టి నిబంధనలు సరళీకృతం చేసింది. ఇది దేశంలో ఎక్కడ నుంచి అయిన శాశ్వతంగా పనిచేసే విధానాన్ని ప్రోత్సహిస్తుంది.. ఐటీ, టెక్, బీపీఓ పరిశ్రమకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తుందని టెలికం శాఖ తెలిపింది. టెలికమ్ విభాగం మార్గదర్శకాల ప్రకారం.. ‘ఓఎస్పీలకు రిజిస్ట్రేషన్ అవసరం పూర్తిగా తొలగించాం. డేటా సంబంధిత పనిలో నిమగ్నమైన బీపీఓ పరిశ్రమను నిబంధనల పరిధి నుంచి తొలగించాం.. ఐపీ అడ్రస్‌ల కోసం చెల్లించే బ్యాంక్ గ్యారెంటీ, తరుచూ నివేదికలు, నెట్‌వర్క్ విధానం మొదలైన నిబంధనలను ఎత్తివేశాం... అదేవిధంగా, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’ విధానాలను అవలంబించకుండా నిరోధించే అనేక ఇతర నిబంధనలను కూడా రద్దుచేసినట్టు టెలికాం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
టెలికం శాఖ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను మరింతగా పెంచడానికి, భారతదేశాన్ని టెక్ హబ్‌గా మార్చడానికి కట్టుబడి ఉన్నాం.. టెలికాం విభాగం ఓఎస్పీ మార్గదర్శకాలను ప్రభుత్వం గణనీయంగా సరళీకృతం చేసింది. ఈ కారణంగా బీపీఓ పరిశ్రమకు భారం తగ్గుతుంది.. ఐటీ పరిశ్రమకు కూడా ప్రయోజనాలు చేకూరుతాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ‘భారత ఐటీ రంగం మాకెంతో గర్వకారణం. ఈ రంగం శక్తి సామర్ధ్యాలను ప్రపంచం మొత్తం గుర్తించింది.. దేశంలో వృద్ధి, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి సాధ్యమైన ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము. కేంద్ర టెలికం శాఖ తాజా నిర్ణయాలు ఈ రంగంలోని యువ ప్రతిభను ప్రోత్సహిస్తాయి అని మోడీ ట్వీట్ లో వెల్లడించారు.
వర్క్ ఫ్రమ్ హోం విధానానికి ఊతమిచ్చేలా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని ఐటీ పరిశ్రమ స్వాగతించింది. ‘ఇది నిజంగా దీర్ఘకాలిక, ప్రగతిశీల ఆలోచన, మన పరిశ్రమను మరింత పోటీలో నిలుపుతుంది.. ఎక్కడి నుంచైనా పనిచేయడం కొత్త రియాలిటీగా మారింది.. దీనిని అమలు చేసినందుకు ధన్యవాదాలు’ అని విప్రో ఛైర్మన్ ప్రేమ్ జీ అన్నారు.
మరోవైపు ఇటీవలే వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి ఐటీ దిగ్గజం విప్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, అమెరికాల్లో పని చేస్తున్న ఉద్యోగులు జనవర 18 వరకు ఇంటి నుండి పని చేయాలని సూచించింది. విప్రోలో 1.85 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇందులో ఎక్కువ మంది భారత దేశంలో పనిచేస్తుండగా, కొంతమంది ఉద్యోగులు విదేశాల్లో ఉన్నారు.గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అవకాశాన్నిచ్చింది.