మాజీ మంత్రులు పరిటాల రవీంద్ర, సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్ కు ఒకే రోజు డబుల్ ప్రమోషన్ లభించింది. పరిటాల శ్రీరామ్ సతీమణి శుక్రవారం నాడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు. తమ కుటుంబంలోకి మరో వ్యక్తి రావడంతో పరిటాల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తమకు కొడుకు పుట్టాడనే విషయాన్ని పరిటాల శ్రీరామ్ కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో పార్టీ నేతలు, అభిమానుల నుంచి వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పరిటాల కుటుంబ అభిమానులు అయితే పరిటాల రవి మళ్లీ పుట్టాడని శ్రీరామ్ ను అభినందిస్తున్నారు.
ఈ వార్త విన్న కొద్దిసేపటికే టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీరామ్ ను టీడీపీ నియమించింది. ఒకే రోజు రెండు శుభవార్తలు వినడం పట్ల పరిటాల అభిమానులు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో... ఈ నియోజకవర్గ బాధ్యతలను ఇప్పటికే పరిటాల శ్రీరామ్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అప్పగించారు.