English | Telugu
కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు...
Updated : Mar 15, 2020
కంచి లో చేసే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్లినట్టు, బీ జె పీ తో కలిసి 2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో అద్భుతం సృష్టించటం కోసం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే అమిత్ షా ను ఆకాశానికెత్తేస్తూ, జగన్ మోహన్ రెడ్డి ని మాత్రం ఓ రేంజ్ లో మాటలతో ఆడుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, హిట్లర్‌లా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లను నిష్పక్షపాతంగా జరిపిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. దాన్ని చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు. ఆధునిక హిట్లర్‌కు ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని అన్నారు. రౌడీయిజానికి, గుండాయిజానికి అధికార పార్టీ నాయకులు కేరాఫ్‌గా నిలిచారని చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండబోదని పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆధునిక ఉక్కుమనిషిగా అభివర్ణించారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తరువాత ఆ స్థాయి శక్తిమంతమైన నాయకుడిగా కితాబునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అత్యంత శక్తిమంతుడిగా ఎదిగారని, ఇప్పుడు అమిత్ షా ఆ స్థాయికి చేరుకున్నారని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను హిట్లర్‌తో పోల్చారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత అంత బలమైన అమిత్ షా కోరిన కోరికను తాను తిరస్కరించానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరారని, తాను కుదరదని కుండబద్దలు కొట్టానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అవసరం ఉందని, అందుకే బీజేపీలో విలీనం చేయదలచుకోలేదని చెప్పారు. జనసేన అనే ఉనికి కోల్పోతే పవన్ కళ్యాణ్ లేడని అన్నారు. పార్టీ ఉనికిని తాను ఎప్పుడూ కాపాడుతానని, ధికారం వచ్చినా రాకపోయినా ఉనికి మాత్రం కోల్పోబోమని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు వెంపర్లాడాయని, తాము మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. దేశ సమగ్రతను కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఆ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నామని పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడటం.. అధికార మదాన్ని చాటి చెబుతోందని విమర్శించారు. అధికారం తమ చేతుల్లో ఉందనే కారణంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు జనసేన అభ్యర్థులపై ఇష్టారాజ్యంగా దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునే శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయని, తమ బలాన్ని నిర్వీర్యం చేయడానికి అధికార పార్టీ నాయకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.