English | Telugu
18,500 ఇవ్వాలి...లేదంటే రైతులను మోసం చేసినట్లే... జగన్ పై జనసేనాని ఫైర్
Updated : Oct 16, 2019
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి జనసేనాని పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. మేనిఫెస్టో తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమంటూ చెప్పే జగన్... ఇచ్చిన మాట తప్పారంటూ మండిపడ్డారు. రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్ యోజన స్కీమ్ తో ముడిపెట్టి అమలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12వేల 500 ఇస్తామంటూ నవరత్నాల్లోనూ, వైసీపీ మేనిఫెస్టోలోనూ, ఎన్నికల సభల్లో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడెందుకు కేంద్రం ఇస్తున్న 6వేలతో కలిపి ఇస్తున్నారని నిలదీశారు. ఇచ్చిన మాట మేరకు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండానే, వెయ్యి రూపాయలు పెంచామంటూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
పీఎం కిసాన్ యోజన పథకంతో రైతు భరోసాను ముడిపెట్టడంతో జగన్ తన ఎన్నిక వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని పవన్ విమర్శించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు... కేంద్రం సాయంతో కలిపి రైతు భరోసా అమలు చేస్తామని జగన్ ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని ఉంటే, కేంద్రం ఇస్తున్న 6వేలతోపాటు తాను ప్రకటించిన 12వేల 500 కలిపి... మొత్తం 18వేల 500 రూపాయలు ఇవ్వాలన్నారు. ఒకవేళ ఎన్నికల హామీని జగన్ నెరవేర్చలేకపోతే, అందుకు కారణాలు వివరించి, రైతులకు క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.