English | Telugu
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో రోగులకు అందని మందులు.. ఎంపీ ఆకస్మిక తనిఖీ
Updated : Nov 27, 2019
సకాలంలో ఆస్పత్రులకు మందులు సప్లై చేసి రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత జిల్లా వైద్యశాఖాధికారులది. అయితే మందుల సరఫరా విషయంలో అధికారులు అంతులేని జాప్యం వహించారు. కర్నూలులో వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో కోట్ల విలువ చేసే మందులు హాస్పిటల్స్ కు సరఫరా చెయ్యక మూలనపడ్డాయి. సరైన సమయంలో ఆసుపత్రులకు మందులు సరఫరా అవుతున్నాయా.. వాటిని డాక్టర్లు రోగులకు పంపిణీ చేస్తున్నారా లేదా అని పర్యవేక్షణ లేకపోవటంతో ఖరీదైన మందులు కాలం చెల్లిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూల్ జనరల్ ఆస్పత్రి పక్కన ఉండే కర్నూల్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు ఆసుపత్రులకు మందుల సరఫరా మందులు రోగులకు ఏ మేరకు పంపిణీ అవుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. దాదాపు 2 కోట్ల విలువ చేసే మందులు జిల్లాలోని సర్కారు ఆస్పత్రులకు సరఫరా కాలేదని. దీనివల్ల 112 రకాల మెడిసిన్స్ ఎక్స్ పైర్ అయ్యాయని ఎంపీకి తెలిపారు. అధికారుల మాటలు విన్న ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ షాకయ్యారు.
కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,18 సామాజిక ఆరోగ్య కేంద్రాలు,22 అర్బన్ హెల్త్ సెంటర్లు, నంద్యాలలో జిల్లా ఆస్పత్రి, ఆదోనిలో ఏరియా ఆసుపత్రి ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యను బట్టి 3 నెలలకు ఒకసారి మందుల కోసం అధికారులు ఆన్ లైన్ లో ఇండెంట్ పెడతారు. ప్రభుత్వం మందులకు సరిపడా బడ్జెట్ కూడా ఏమాత్రం ఆలస్యం కాకుండా మంజూరు చేస్తుంది. ఆ నిధులతో మందుల కంపెనీల ద్వారా మెడిసిన్స్ కొని జిల్లాలకు పంపుతారు. కంపెనీల నుంచి వచ్చిన డ్రగ్స్ మంచివా కాదా అని అధికారులు పరిశీలించాక ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇండెంట్ ప్రకారం మందులు ఆసుపత్రికి సరఫరా అయ్యాయా లేదా అని వైద్యాధికారులు దృష్టి సారించడం లేదు. సర్కార్ హాస్పిటల్స్ కు మందుల సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ చేసే ఆఫీసర్ లు లేకపోవటం వల్ల మందులు జిల్లా కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సర్కార్ మందులు అందడం లేదు. మరోవైపు డాక్టర్ లు కూడా హాస్పటల్స్ కు వచ్చే పేషెంట్ లకు మెడిసిన్స్ బయటకు రాసిస్తున్నారు.
కర్నూలులోని ఒక జనరల్ ఆసుపత్రిలో మినహా మిగతా ఆసుపత్రుల్లో ఏడాది క్రితం నుంచి మందులు రోగులకు అందటం లేదు. ప్రభుత్వం ఇచ్చే మందుల కోసం వారాల పాటు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది మందులు ఇవ్వడం లేదంటూ ఏవో కొన్ని మందులు ఇచ్చి మిగతా మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్న మందులు దొరకడం లేదని పేషెంట్స్ మండిపడుతున్నారు.