English | Telugu

కరోనా మహమ్మారి వల్ల రూ.866 లక్షల కోట్ల నష్టం

కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 11.7 లక్షల కోట్ల డాలర్ల(దాదాపు రూ.866 లక్షల కోట్ల) నష్టం వాటిల్లిందని ఆక్స్ ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదంతా ఈ సంవత్సరం ప్రపంచం చెల్లించుకున్న అదనపు మూల్యమని తెలిపింది. మొత్తం నష్టంలో 83 శాతం నష్టం 36 సంపన్న దేశాలకు ఏర్పడిందేనని పేర్కొంది. 56 అల్పాదాయ దేశాలు ఈ మొత్తంలో కేవలం 0.4 శాతం మాత్రమే నష్టపోయాయని తెలిపింది.

ఈ అదనపు వ్యయంలో అధిక భాగం సామాజిక సంక్షేమం కోసం ఖర్చయిందని ఆక్స్‌ ఫామ్‌ పేర్కొంది. 28 సంపన్న దేశాలు తమ జనాభాలో ఒక్కొక్కరిపై 695 డాలర్లు ఖర్చు చేయగా.. పేద, మధ్య తరగతి దేశాలు ఒక్కొక్కరిపై 4 నుంచి 28 డాలర్ల వరకూ వెచ్చించాయని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది.

కరోనా సంక్షోభ కాలంలో పని గంటలు తగ్గడం, లాక్ డౌన్, కంపెనీల మూసివేత కారణంగా ఆసియా పసిఫిక్‌ దేశాల్లో 8.10 కోట్ల మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌ఓ) తెలిపింది. కరోనా సంక్షోభం ప్రజల ఆదాయం, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. కరోనా సోకకముందుతో పోలిస్తే పనిగంటలు 15 శాతానికి పైగా తగ్గాయని, ఇంకా పూర్తి స్థాయిలో ఏ రంగమూ కోలుకోలేదని ఐఎల్‌ఓ తెలిపింది.