English | Telugu

"ష్.. ఎవ్వరికీ చెప్పొద్దు.. ఆ సర్కార్ ను కూలదోసింది మోడీయే".. బీజేపీ నేత సంచలనం

పాపం.. చుట్టూ ఉన్నది తమవాళ్లే అనే ఆవేశంలో కొంతమంది నాయకులు నోరు జారి నిజాలు చెప్పేసి తరువాత తీరిగ్గా నాలుక్కరుచుకున్న సంఘటనలు అనేకం మనం చూసాం. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ప్రధాని నరేంద్ర మోడీ చాల ప్రముఖ పాత్ర పోషించారని వ్యాఖ్యలు చేశారు. ఇండోర్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ‘‘ఈ మాటలు ఎవ్వరితోనూ చెప్పకండి. ఇప్పటి వరకూ నేను కూడా ఎవరికీ చెప్పలేదు. ఈ సభ ద్వారానే మొదటి సారిగా వెల్లడిస్తున్నాను. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఎవరైనా ప్రముఖ పాత్ర పోషించారంటే అది మన ప్రధాని మోడీయే. దీంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర ఏమి లేదు .’’ అని విజయ వర్గీయ వ్యాఖ్యానించారు. బీజేపీ కీలక నేత విజయ వర్గీయ తాజా వ్యాఖ్యల పై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.