English | Telugu

ఆర్టీసీని మీరే కాపాడాలి.. గవర్నర్ కు వినతి పత్రం అందించిన అఖిలపక్షం

ఆర్టీసీ సమ్మె ఎన్ని రోజులైనా ఒక కొలిక్కి రావడం లేదు. ఒక పక్క తమకు ఏది పట్టనట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తొంది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని గవర్నర్ ను కోరారు అఖిల పక్ష నేతలు. సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసారు. గవర్నర్ జోక్యం చేసుకొని ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అఖిల పక్షం వినతి పై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు నేతలు. కార్మికులు చేస్తున్న సమ్మె ఇరవై ఏడు రోజులు దాటినా సర్కారు పట్టించుకోవడం లేదని సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు సూచనలు, కార్మికుల ఆత్మహత్యలపై గవర్నర్ కు వివరించారు.

ఆర్టీసీలో కేంద్ర భాగస్వామ్యం కూడా ఉందని సమ్మె విషయంలో కేంద్రం కూడా స్పందించాలని కోరారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఆర్టీసీ ఆదాయం రూ.3900 కోట్ల నుంచి రూ.4900 కోట్లకు ఎగబాకిందని తెలియజేశారు. కార్మికులు ఎవ్వరూ కూడా తమ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీతభత్యాల కోసం సమ్మె చేయడం లేదని.. ఆర్టీసీని కాపాడమనే వారు కొరుతున్నారని తెలిపారు. వెంటనే చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలకాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కార్మికుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీలో ఆర్టీసీ విలీనంతో అక్కడి కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారని తెలంగాణలో మాత్రం జీతాలు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు నేతలు. కార్మికులు, ఉద్యోగులు, టీచర్లు అంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. గవర్నర్ పవర్స్ ఉపయోగించి కార్మికులను కాపాడాలని కోరారు. అప్పులున్నాయని ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వం చేసిన అప్పులకు ఏం చేయాలని ప్రశ్నించారు టిడిపి నేత రావుల.

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మ గౌరవంతో ఆర్టీసీ రక్షణ కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు ఓయూ విద్యార్థులు. ఆర్టీసీ అమరులకు నివాళులర్పిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి కొవ్వత్తుల ర్యాలీ చేశారు విద్యార్థులు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం సమస్య లు పరిష్కరిం చే వరకు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కార్మికులకు అండగా ఉంటామని తెలిపారు ఓయూ విద్యార్థి సంఘాలు. అందరూ ఒక్కదాటిపై ఉన్నా కూడా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాడని సామన్య ప్రజలు వాపోతున్నారు.