English | Telugu

కరోనా.. ఉత్తర కొరియా.. కఠిన నిజాలు

కరోనా వ్యాప్తి ప్రపంచంలోని అనేక దేశాలను చిన్నాభిన్నం చేసింది. కోట్లాది మందికి సోకి లక్షలాది మంది ప్రాణాలు బలి తీసుకోంటుంది. ఈ మహమ్మారి వ్యాపించని దేశం లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అయితే జూలై 26 వరకు ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా అధికారికంగా ప్రకటించలేదు. నియంతృత్వపాలనలో ఉన్న ఆ దేశంలో సమాచారం బయటి ప్రపంచానికి తెలియడం కష్టమే. అయితే ఇప్పుడు కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరడంతో తప్పనిసరి పరిస్థితిలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి లాక్ డౌన్ విధించారు. మొదటి కరోనా కేసు నమోదు అయ్యిందని అధికారికంగా ప్రకటించారు.

కరోనా సోకిన వ్యక్తి ఉత్తర కొరియా నుంచి మూడేండ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయాడు. తిరిగి స్వంతదేశానికి చేరుకున్నాడు. గాంగ్వా ద్వీపం నుంచి సముద్రంలో ఈదుకుంటూ ఉత్తరకొరియా చేరుకున్నాడని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.

ఉత్తర కొరియా నుంచి పారిపోయిన దక్షిణ కొరియాకు వచ్చిన వ్యక్తులు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 2017 వరకు 11మంది మాత్రమే తిరిగి ఉత్తర కొరియా వెళ్ళారని ఇప్పుడు 12వ వ్యక్తి వచ్చాడని వ్యాఖ్యానిస్తున్నారు.

నియంతృత్వపొకడలో ఉన్న ఉత్తర కొరియా నుంచి అవకాశం ఉంటే పారిపోవాలని చూస్తారే తప్ప తిరిగి ఆ దేశం వెళ్ళాలని ఎవరూ అనుకోరు. ఇంతకు ఆ దేశంలో ప్రజా జీవనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే గత కొన్ని నెలల కిందట ఆ దేశానికి ఐదు రోజుల పాటు టూరీస్ట్ గా వెళ్లి అక్కడ ప్రభుత్వం అనుమతి మేరకు కొన్ని ప్రదేశాలను సందర్శించిన ఒక యువకుడి అనుభవాల ద్వారా తెలుసుకోవల్సిందే..

ఉత్తర కొరియా గురించి భయంకరమైన నిజాలు..!!
ప్రపంచంలో నియంతృత్వ పొకడలు ఉన్న దేశం ఉత్తర కొరియా. ఇక్కడ కఠినమైన చట్టాలు ప్రజలను నిరుత్సాహాపూరిత జీవితానికి అలవాటు పడేలా చేస్తాయి.

ఒకవైపు చైనా, మరోవైపు దక్షిణ కొరియా సరిహద్దులుగా ఉండే ఉత్తర కొరియాకు బీజింగ్ నుండి 24 గంటల ట్రైన్ ప్రయాణం చేసి ఆ దేశ సరిహద్దుకు చేరుకున్నాం. ఇక్కడి నుండి ఒంటరిగా దేశంలోకి వెళ్లాలంటే చాలా అనుమతులు తీసుకోవాలి. అందుకే కొంతమంది కలిసి టూరిస్ట్ గ్రూప్ గా ప్రయాణించాల్సి ఉంటుంది. బార్డర్ దాటిన క్షణం నుండే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది. సైనికులు మన దగ్గర ఉన్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిక్షిస్తారు. మన ఫోన్ లోని ప్రతి ఫోటోను మన దగ్గర ఉన్న పుస్తకాల్లోని ప్రతి పేజీని పరిక్షిస్తారు. సైనిక దుస్తుల్లో ఉన్న వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో ఫోటోలు తీయకూడదు.

ఈ దేశంలో మతాలు నిషేధం. అందుకే మన వద్ద మతపరమైన గ్రంథాలు బైబిల్, ఖురాన్ లేదా ఇతర మత సంబంధమైన ఏ పుస్తకాలను తీసుకెళ్లకూడదు. అంతేకాదు రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, ఇంటర్నెట్ ట్రాన్స్ మీటర్, సున్నితమైన విషయాలకు సంబంధించిన వేటిని కూడా తీసుకెళ్లకూడదు. సైనికులు మన దగ్గర ఉన్న ఫోన్లను తీసుకొని అందులో ఎటువంటి ఫోటోలు ఉన్నాయో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడ సైనికులు పరీక్షించే తీరు చూస్తుంటే జైలు లోకి వెళ్ళుతున్నమా అన్న ఫీల్ కలుగుతుంది.

ఇక దేశంలో ఎక్కడ చూసిన తీవ్రమైన పేదరికం, నిర్బంధం కనిపిస్తుంది. బయటి ప్రపంచంలో అనుసంధానం చేసే మొబైల్ నెట్వర్క్ లు లేకపోవడంతో సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నట్టే. వైఫై, ఇంటర్నెట్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలాంటి ఏవీ అక్కడి ప్రజలకు తెలియదు. ఇక్కడ మరో గొప్ప విషయం ఎమిటంటే దేశప్రజల అవసరాలు కావల్సిన వస్తువులు చాలావరకు దేశంలోనే తయారు చేస్తారు. ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ తక్కువే కాబట్టి ఇతర దేశాలతో చాలా తక్కువ వ్యాపార సంబంధాలు కలిగిఉంటారు.

ఉత్తర కొరియాలో ఆంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాన్ని బయటకు తెలియకుండా చేయడానికి నిర్బంధం ఉంటుంది. అక్కడ నెలకొన్న తీవ్రమైన పేదరికం ప్రపంచానికి తెలియకూడదు అన్న కారణంగానే ఇంత నిర్భంధం ఉందేమో అనిపిస్తుంది. జాతీయ రహదారుల పైన కూడా చాలా తక్కువ కార్లు తిరుగుతుంటాయి. ఇప్పటి ప్రజలకు కొనుగోలు శక్తి చాలా తక్కువ. ఇండ్లల్లో ఎప్పుడూ స్థిరంగా కరెంట్ ఉండదు. తరచు పవర్ కట్స్ తో ఎక్కువ సమయం చీకటిలోనే ఉండాల్సి వస్తుంది. రోడ్ల మీద అక్కడి ప్రజల్లో పేదరికం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

అయితే ఉత్తర కొరియా పేద దేశం కాదు. గొప్ప సంస్కృతి, సంప్రదాయం ఉంది. ఆటలు, కళలు ఉన్నాయి. కానీ వాటి పట్ల పాలకులకు పెద్దగా పట్టింపులు లేవు. వాళ్ల దృష్టి, ఆసక్తి అంతా సైన్యం మీదనే. దేశ బడ్జెట్ లో ఎక్కువ శాతం సైన్యం కోసమే ఖర్చు చేస్తారు. క్షిపణులు, యుద్ధ టాంకులు సిద్ధం చేస్తూ దేన్ని అయిన ఎదుర్కోగలం అనే కృత్రిమ భ్రమతో వారి పాలన ఉంటుంది. అందుకే దేశంలో ఎటు చూసినా సైనిక ప్రదర్శనకు సంబంధించిన అంశాలే కనిపిస్తాయి. ఏ భవనం మీద చూసినా వాళ్ళ నాయకుల విగ్రహాలే కనిపిస్తాయి. వీటిమీదనే ఆ దేశం మొత్తంగా దృష్టి సారించింది.

ఉత్తర కొరియా లో టూరిస్ట్ గా ఐదు రోజుల ఉండటానికే వీలు ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఏది అయితే చూసేందుకు అనుమతించిందో వాటిని మాత్రమే చూశాను. ఇక అక్కడి నుండి మళ్ళీ తిరిగొస్తున్నప్పుడు మళ్ళీ ఒక సారి సైనికులు మా వస్తువులను చెక్ చేశారు. కానీ అదృష్టవశాత్తూ వాళ్ళు మా కెమెరాలను గమనించలేదు.