English | Telugu
గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!
Updated : Jan 8, 2026
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే.
అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్ సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.
జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.