English | Telugu

గెలిచిన తరువాత ఆ ఇద్దరికి షాకిచ్చిన కేజ్రీవాల్...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బంపర్ విక్టరీకి దోహదపడిన ఇద్దరు కీలక వ్యక్తులకు కేజ్రీవాల్ షాకిచ్చారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీవాల్ పాత మంత్రి వర్గాన్నే కొనసాగించాలని డిసైడయ్యారు. తద్వారా కేబినెట్ లో చోటు ఖాయమనుకున్న అతిషి మర్లేనా, రాఘవ్ చద్దాలకు మొండిచేయి చూపారు. ఆప్ హ్యాట్రిక్ విజయంలో కీలక భాగస్వాములు అతిషి మర్లేనా, రాఘవ్ చద్దాలు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది అతిషి, స్కూళ్లను బాగు చేసింది ఆమెనే. ఆప్ నేతలలో కేజ్రీవాల్, సిసోడియా తర్వాత దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన వ్యక్తుల్లో అతిషి మర్లేనా ఒకరు. గత లోక్ సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి క్రికెటర్ గౌతం గంభీర్ పై ఓడిపోయిన ఆమె, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజక వర్గం నుంచి 11,393 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న అతిషి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సలహాదారుగా ఉంటూ ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సలహాదారుల నియామకం చట్ట విరుద్ధమని కేంద్రం అభ్యంతరం చెప్పడంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అతిషికి ఢిల్లీ విద్యా మంత్రి పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, సీఎం సానుకూలంగా స్పందించలేదు.

ఢిల్లీ లో ఆప్ కు తిరుగులేని మెజారిటీ అందించిన ఉచిత పథకాల రూపకర్త రాఘవ్ చద్దాను కూడా క్యాబినెట్ లోకి తీసుకోరాదని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన చద్దా ఢిల్లీ ఆర్ధిక శాఖకు ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. కేంద్రం అభ్యంతరంతో ఆ పదవిని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి ఇరవై వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆప్ అధికార ప్రతినిధి లీగల్ వ్యవహారాల ఇన్ చార్జి గానూ కొనసాగుతున్న చద్దాకు కొత్త క్యాబినెట్ లో చోటు ఖాయమని అందరూ భావించినా చివరికి అలా జరగలేదు. క్యాబినెట్ లో మార్పులు చెయ్యకూడదని కేజ్రీవాల్ నిర్ణయించటంతో ఆదివారం ఆయనతో పాటు మరో ఆరుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనీష్ సిసోడియా మళ్లీ డిప్యూటీ సీఎం గా కొనసాగనున్నారు. సత్యేంద్ర కుమార్ జైన్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతమ్, కైలాష్ గెహ్లాట్ లు యథావిధిగా మంత్రి పదవుల్లో కొనసాగనున్నారు. ప్రఖ్యాత రాంలీలా మైదాన్ లో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.