English | Telugu

ఒక్కరోజు మానేస్తే 8రోజుల జీతం కట్... 52డేస్ మానేస్తే ఇంకా జీతమేంటన్న ప్రభుత్వం

ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ఒకవైపు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకునేందుకు ససేమిరా అంటోన్న ప్రభుత్వం.... మరోవైపు జీతాలు కూడా చెల్లించేది లేదంటూ మరో షాకిచ్చింది. వేతనాలు చెల్లించకపోవడంతో... 48వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే జీతాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరగా, ప్రభుత్వం సరికొత్త వాదనలు వినిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు చెల్లించలేమన్న ప్రభుత్వం... పేమెంట్ ఆఫ్ పేజెస్ యాక్ట్-7 ప్రకారం ఒకరోజు విధులకు హాజరుకాకుంటే... 8రోజుల జీతం కట్ చేయవచ్చని... ఆ లెక్కన, కార్మికులు 52రోజులుగా సమ్మెలో ఉండటంతో జీతాలు చెల్లింపు సాధ్యంకాదంటూ హైకోర్టు వాదించింది. దాంతో, జీతాలు కూడా వస్తాయో రావోనన్న భయం ఆర్టీసీ కార్మికులను వెంటాడుతోంది.

మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళనలతో డిపోల దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బలవంతంగా విధుల్లో చేరేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండటంతో ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాంతో, కొన్ని డిపోల దగ్గర పోలీసులు-కార్మికుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరుగుతున్నాయి.

ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిపై మండిపడుతోన్న ఆర్టీసీ జేఏసీ... సమస్య పరిష్కారం కోసం కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయం తీసుకుంది. సమ్మె విరమించినా, కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంపై అఖిలపక్షాలతో చర్చించిన ఆర్టీసీ జేఏసీ... ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.