English | Telugu

పరారీలో నిత్యానంద... ఇద్దరు మైనర్ బాలికలను బంధించాడని కేసు నమోదు

వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. క్రిమినల్ కేసు నమోదు కావడంతో స్వామి నిత్యానంద దేశం విడిచి పారిపోయాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. నిత్యానంద కోసం అన్ని చోట్ల తీవ్రంగా గాలిస్తున్నారు. బాలికల్ని అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణతో నిత్యానందపై కేసు నమోదైంది.

ఆశ్రమంలో ఇద్దరు మైనర్ బాలికలను బంధించారని వారి తల్లిదండ్రులు నిత్యానంద ఆశ్రమంపై ఫిర్యాదు చేశారు. గుజరాత్ కు చెందిన జనార్దన శర్మ తన కుమార్తెల కోసం చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిత్యానంద ఆశ్రమంలో ఉన్న జనార్దన శర్మ ఇద్దరు కూతుళ్లు కొన్నాళ్లుగా అక్కడే ఉంటూ ఇంటికి రావడానికి నిరాకరించారు. తన కూతుళ్లని అక్రమంగా ఆశ్రమంలో ఉంచారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జనార్దన శర్మ. ఈ కంప్లయింట్ గుజరాత్ హై కోర్టు వరకు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. నిత్యానందకు చెందిన సర్వజ్ఞ ఆశ్రమానికి పోలీసులు వెళ్లడంతో అక్కడ జరుగుతున్న భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. తమను బాగా హింసించారని.. పనిచేయాలని పదిరోజులకుపైగా ఒక ఫ్లాట్ లో అక్రమంగా నిర్బంధంలో ఉంచారని పోలీసులకు చెప్పారు బాధితులు. ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు చిన్నారులకు బంధ విముక్తి కల్పించారు. యోగిని సర్వజ్ఞ పీఠములో ఉన్న బాలికలను విడిపించిన అహ్మదాబాద్ పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్నారు.

కిడ్నాప్, అక్రమంగా నిర్బంధించడం, దాడి చేయడం లాంటి ఆరోపణలతో నిత్యానంద శిష్యులైన ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. నిత్యానంద దేశం విడిచి పారిపోయారని అనుమానిస్తున్న తరుణంలో ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ఆయన ఎక్కడ ఉన్నాసరే వదిలే ప్రసక్తే లేదని గుజరాత్ పోలీసులు ప్రకటించారు. అవసరమైతే విదేశాలకు వెళ్లిన నిత్యానందను అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖతో వివిధ విభాగాలకు సమాచారమిచ్చి నిత్యానంద కోసం వేట సాగిస్తున్నారు గుజరాత్ పోలీసులు.

ఆశ్రమం పేరుతో సెక్స్ పాఠాలు చెప్పడం.. అదేమంటే తానే భగవంతుడని బుకాయించటం నిత్యానందకు అలవాటు అయిపోయాయి. శిష్యులపై కన్నా శిష్యురాలు అంటే ఎక్కువ ప్రేమ చూపించి నిత్యానంద ఏకంగా సినీ నటి రంజితకే వలేశాడు. రంజితను శిష్యురాలిగా చేర్చుకొని మా ఆనందమయి అంటూ కొత్త పేరు పెట్టారు. ఆమెతో కలిసి ఆశ్రమంలో చేసిన రాసలీలలు టేపులుగా బయటకు రావడంతో నిత్యానంద గుట్టు రట్టైంది. 2010లో వెలుగులోకి వచ్చిన నిత్యానంద, రంజిత టేపులు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అప్పట్లో పోలీసులు నిత్యానంద, రంజితను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో నిత్యానంద చెప్పిన విషయాలు మరింత చర్చ నీయాంశంగా మారాయి. తాను అస్సలు మగాడినే కాదని నిత్యానంద బుకాయించాడు. అయితే పురుషత్వ పరీక్షలు జరపాలని పోలీసులు ప్రయత్నించారు. దీనికి అంగీకరించని నిత్యానంద కోర్టును ఆశ్రయించాడు. అయితే పురుషత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో చివరకు టెస్టులకు అంగీకరించాడు. నిత్యానంద పురుషుడేనని డాక్టర్ లు తేల్చడంతో మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. కొన్నాళ్ల పాటు జైలులో వున్న నిత్యానంద తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు.

కొన్నిరోజులు గప్ చుప్ గా ఉండి మళ్లీ తన స్టైల్ పనులు మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం నిత్యానంద ఆశ్రమంలో యువతి శవం బయటపడటం సంచలనం రేపింది. యువతి మరణించిన విషయాన్ని ఆశ్రమ వర్గాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఒకటి రెండు కాదు నిత్యానందపై పెద్ద సంఖ్య లోనే ఫిర్యాదులున్నాయి. అమ్మాయిల్ని అక్రమంగా నిర్బంధించడం వారిని రాసలీలల కోసం ఉపయోగిస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇద్దరు మైనర్ బాలికల సంగతి వెలుగులోకి రావడంతో విదేశాలకు పారిపోయాడు నిత్యానంద. చివరికి పిచ్చి వాడు అయ్యేలా ఉన్నడంటూ కొందరు.. వీడి పిచ్చితో చిన్న పిల్లలని బానిసలుగా చేసుకుంటున్నాడంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.