English | Telugu
కొత్త దేశం వచ్చింది.. ఆ దేశం నుండి 14 లోకాలకు ప్రవేశం ఫ్రీ.. నిత్యానందుడే రాజు
Updated : Dec 5, 2019
కొత్త ఇళ్లు కట్టుకునే వాళ్ళని చూశాము.. కొత్త వెంచర్ వేసే వాళ్లని చూసి ఉంటాము. అలాంటిది ఊరు.. రాష్ట్రం కూడా కాదు ఏకంగా కొత్త దేశాన్నే ఏర్పాటు చేసుకున్నాడు నిత్యానంద. " కైలాసం రివైవింగ్ ద ఎన్ లైట్ అండ్ సివిలైజేషన్ ద గ్రేట్ హిందూ నేషన్ " అనే పేరుతో నిత్యానంద కొత్త దేశానికి నామకరణం కూడా చేశాడు. దక్షిణ అమెరికా లోని ఈక్వెడార్ కు సమీపంలో ఉంది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సమీపంలో ఉండే ఒక ద్వీపాన్ని ఈక్వెడార్ నుంచి కొనేసుకున్న నిత్యానంద ఆ దీవిలో తన సొంత దేశాన్ని ఏర్పాటు చేసి సొంత జెండా, పాస్ పోర్ట్, జాతీయ చిహ్నం, రాజ్యాంగం ఇలా అన్నింటినీ రూపొందించుకున్నాడు. ఆ దేశానికి ఆయనే రాజు.. పాలన కోసం ప్రధాన మంత్రిని మంత్రిమండలిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కైలాస వాసులు కావాలనుకునే వారికి ఒక బంపర్ ఆఫర్ ఉంది. అదేంటంటే ఆ దేశానికి విరాళాలు ఇవ్వడమే.. పైసలిస్తే పౌరసత్వ పథకం అన్నమాట. అలా పైసలిచ్చినవారికి పాస్ పోర్టులు ఇస్తారు. ఆ దేశ పాస్ పోర్ట్ పౌరుసత్వం లేకపోయినంత మాత్రాన దిగులు చెందక్కర్లేదు.. ప్రపంచంలో ఏ మూల ఉన్నా హిందూయిజాన్ని ఆచరించలేకపోతున్న హిందువులైతే చాలు ఆ దేశ పౌరులేనట, ఆదేశం హద్దుల్లేని దేశమట.
మనం ఫలానా దేశ పౌరులమని ధ్రువీకరించే గుర్తింపు పత్రం పాస్ పోర్టు. మన అందరి వద్ద ఉండేది భారత పాస్ పోర్ట్ దాని ప్రయోజనం అంతవరకే, వేరే దేశాలకు వెళ్లాలంటే మన పాస్ పోర్టుతో పాటు ఆయా దేశాలు ఇచ్చే వీసా కావాలి. కానీ నిత్యానందుడు తన కైలాసవాసులకు ఇచ్చే పాస్ పోర్టుతో 11 డైమన్షన్ లకు, 14 లోకాల లోకి ప్రవేశం ఉచితం. ఆయా లోకాల వీసాలు గట్రా అక్కర్లేదు. కానీ పాస్ పోర్టులో మాత్రం కించిత్ స్థాయి బేధాలున్నాయి. స్థాయిని బట్టి కొందరికి బంగారం రంగులో ఉండే గోల్డెన్ పాస్ పోర్ట్, మరికొందరికీ ఎర్ర రంగు అట్టతో ఉండే పాస్ పోర్ట్ ఇస్తారు. ఏ స్థాయి వాళ్ళకి ఏ రంగు పాస్ పోర్ట్ ఇస్తారనే వివరాల్లో మాత్రం కైలాస్ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించలేదు. తన సొంత దేశానికి ప్రధానిగా తన అనుచరుడు సన్నిహితుడైన మా అనే వ్యక్తిని ప్రధానిగా నియమించిన నిత్యానంద మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు. సదరు ప్రధాని మంత్రులతో నిత్యానందుడు నిత్యం చర్చలు సమావేశాలు కూడా జరుపుతున్నాడు. కైలాస దేశ రాజ్యాంగంలో 547 పేజీలున్నాయి. తమిళం, హిందీ, సంస్కృత భాషల్లో ఆ రాజ్యాంగం వుంటుంది.