English | Telugu

ఏపీ సర్కార్ సహకరించడం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్  

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయం పై ఈరోజు రాష్ట్ర గవర్నర్ హరిచందన్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుమారుగా 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో తాను పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సమావేశ వివరాలను ఎస్ఈసీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం లేదని అయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై పునరాలోచాన చేయాలనీ.. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధంగా లేదని.. అదే సమయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించవద్దని సీఎస్ నీలం సహానీ రాసిన లేఖను తీసుకు వెళ్లి ఎస్ఈసీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం సహకరించడం లేదని.. హైకోర్టు ఆదేశాలను సీఎస్ నీలం సహానీ ఉల్లంఘిస్తున్నారని ఒక లేఖ ద్వారా అధికారికంగా నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఒకపక్క పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా స్వయంప్రతిపత్తి గల ఎస్ఈసీ సంస్థను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని గవర్నర్ కు అయన ఫిర్యాదు చేశారని సమాచారం.

ఏపీలో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమని చెపుతున్న జగన్ ప్రభుత్వ వాదనపై.. నిమ్మగడ్డ తన వాదన‌ను కూడా వివరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని.. దానికి సంబంధించిన గణాంకాలను కూడా అయన వివరించినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీలో కరోనా కారణంగా ప్రభుత్వం తన కార్యకలాపాలలో ఏ ఒక్కదాన్ని కూడా వాయిదా వేయలేదని.. ఇటు మద్యందుకాణాల దగ్గరనుండి అటు స్కూళ్ల వరకూ అన్నింటినీ ప్రారంభించారని .. మరో పక్క ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్న విషయాన్ని అయన గవర్నర్‌కు వివరించినట్లుగా సమాచారం.

తాజాగా నిమ్మగడ్డ సమర్పించిన లేఖపై గవర్నర్ స్పందించకపోయినా, లేక ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించి.. సహకరించకపోయినా.. అయన మరోసారి హైకోర్టుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సహకరించకపోతే.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.