English | Telugu

సొంత గూటివైపు కీలక నేతలు! ఆ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేనా?

తెలంగాణలో టీడీపీకి మంచి రోజులు రాబోతున్నాయా? గతంలో చక్రం తిప్పిన నేతలు తిరిగి సొంత గూటికి రాబోతున్నారా? సీఎం కేసీఆర్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు?. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. గతంలో తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీకి పునర్ వైభవం రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో ఓ వెలుగు వెలిగి.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలు టీడీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే టీటీడీపీకి మళ్లీ బలమైన శక్తిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఖమ్మం జిల్లా నుంచే రాజకీయ పెను మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి , గతంలో టీడీపీలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తిరిగి సొంత గూటికే వస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తన అనుచరులతో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారని చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ ఫస్ట్ టర్మ్ లో మంత్రిగా పనిచేశారు తుమ్మల, అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరులో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాల్లో ఆయన సైలెంట్ గానే ఉన్నారు.

తుమ్మలపై గెలిచిన ఉపేందర్ రెడ్డి కూడా కొన్ని రోజుల తర్వాత కారు పార్టీలో చేరారు. ఉపేందర్ రెడ్డి చేరికతో నియోజకవర్గంలో తుమ్మల హవా పూర్తిగా తగ్గిందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, అధికార యంత్రాంగంమంతా ఉపేందర్ రెడ్జి డైరెక్షన్ లోకి వెళ్లిపోయాయి. పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన ప్రాధాన్యం తగ్గడంతో తుమ్మల మరింత సైలెంట్ అయిపోయారు. తుమ్మ‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌డం ఇబ్బంది మారడంతో చాలా వ‌ర‌కు ఆయన ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. టీఆర్ఎస్ హైకమాండ్ కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదని తుమ్మల అనుచరులు చెబుతున్నారు.

టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న తుమ్మల పార్టీ మారుతారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ ముఖ్యనేతలు ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే తుమ్మల మాత్రం బీజేపీలోకి వెళ్లేకంటే టీడీపీలో చేరితే బెటరని భావిస్తున్నారనే చర్చ ఖమ్మం జిల్లాలో జరుగుతోంది. టీడీపీకి తెలంగాణలో బలమైన కేడర్ ఉందని.. సరైన లీడర్ వస్తే వారంతా యాక్టివ్ అవుతున్నారని తుమ్మల భావిస్తున్నారని చెబుతున్నారు. తుమ్మల టీటీడీపీ పగ్గాలు చేపడితే.. గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఇతర పార్టీల్లోనే ఉన్న నేతలంతా తిరిగి సొంత గూటికి వస్తారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. గ‌తంలో తెలంగాణ టీడీపీలో ప‌నిచేసి..ఇప్పుడు రాజ‌కీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న నేత‌ల‌ను కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ను జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మాజీమంత్రి తుమ్మ‌ల‌కు అప్ప‌గించ‌బోతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. గ‌తంలో తుమ్మ‌ల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ప్రియారిటీని సైతం వారు గుర్తు చేస్తున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు కదలికలను గమనిస్తున్న సీఎం కేసీఆర్.. ఆయన పార్టీ మారతారనే ప్రచారంతో అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇటీవల రైతు వేదిక ప్రారంభోత్సవం కోసం ఇద్దరు మంత్రులు తుమ్మల ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం వచ్చిన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డిలు.. తుమ్మల ఇంటికెళ్లారు. ఇద్దరు మంత్రులు దగ్గరుండి ఆయన్ను రైతు వేదిక ప్రారంభోత్సానికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే అజయ్, నిరంజన్ రెడ్డిలు తుమ్మల ఇంటికి వచ్చారనే చర్చ జరుగుతోంది. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని తుమ్మలను కేసీఆర్మంత్రుల ద్వారా బుజ్జగించినట్లు చెబుతున్నారు. ఇంతకాలం తుమ్మలను పట్టించుకోని కేసీఆర్.. ఆయన పార్టీ మారుతారనే ప్రచారంతో టెన్షన్ పడుతున్నారని సమాచారం. అందుకే ఇద్దరు మంత్రులను రాయబారానికి పంపారని చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ ఇద్దరు మంత్రులను తుమ్మల ఇంటికే పంపారంటనే ఆయన పవర్ ఏంటో తెలుసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ బలపడితే టీఆర్ఎస్ కే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టే గులాబీ బాస్ గుబులు పడుతున్నారని వారు అంటున్నారు. తుమ్మల గనక టీడీపీలోకి వస్తే తెలంగాణ రాజకీయ సమీకరణలు భారీగా మారిపోయే అవకాశం ఉందంటున్నారు. అయితే తుమ్మ‌ల మాత్రం తనపై జరుగుతున్న ప్రచారంపై మౌనం వీడ‌టం లేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా ఆయ‌న దూరంగా ఉంటున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి తుమ్మ‌ల ఎలాంటి రాజకీయ నిర్ణ‌యం తీసుకుంటారన్నదానిపై మాత్రం జనాల్లో ఆసక్తి పెరుగుతోంది.