English | Telugu
బయటపడనివి మరెన్నో... నయీం ఆస్తుల విలువ అక్షరాల రూ.1200 కోట్లు
Updated : Nov 28, 2019
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఆదాయపు పన్ను శాఖ విచారణ వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా నయీం భార్య హసీనాబేగంను ఐటీ అధికారులు విచారించారు. నయీం ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని హసీనా బేగం ఐటి అధికారులకు వెల్లడించారు. నల్లగొండలోని ఇంటితో పాటు మరి కొన్ని ఆస్తులని తాను దర్జీ పని చేసి సంపాదించినట్లు హసీనా బేగం ఐటీ అధికారులకు వివరించినట్టు తెలిసింది. ఇతర ఆస్తులకు సంబంధించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం.
నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటావిడ పర్హాన పేరుతో ఉన్న ఆస్తుల గురించి కూడా ఐటీ అధికారులు హసీనాబేగంను ఆరా తీశారు. ఫర్హానా పేరుతో హైదరాబాద్ , సైబరాబాద్ తో పాటు రంగారెడ్డి, నల్గొండలో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఒక్క ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని గుర్తించారు ఐటీ అధికారులు. ఆ కోణంలోనూ హసీనా బేగం నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆదాయ మార్గం లేకుండానే విలువైన భూముల సెటిల్ మెంట్ లతో నయీం పెద్ద మొత్తంలో సంపాదించడాన్ని అధికారులు నిర్ధారించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత సిట్ నిర్వహించిన దర్యాప్తులో గుర్తించిన అంశాల్ని ఐటీ అధికారులు సేకరించారు. సిట్ నివేదిక ప్రకారం తాము గుర్తించిన ఆస్తుల అనధికారికమైనవి ఆయా ఆస్తులకు ఐటీ చెల్లించలేదని నిగ్గు తేల్చిన అధికారులు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, సెటిల్ మెంట్ లు, భూకబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. నయీం ఎన్ కౌంటర్ జరిగిన శంషాబాద్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఇల్లు, నయీం బావమర్ది సాజిద్ పేరుతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బంధువులు.. గ్యాంగ్ సభ్యుల బినామీ పేర్లతో నయీం రిజిస్ర్టేషన్ చేయించినట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో బహిర్గతమైంది.
నయీం బినామీ ఆస్తుల విలువ మార్కెట్ లో రేటు ప్రకారం సుమారు 1200 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. విచారణ అనంతరం త్వరలోనే ఆయా ఆస్తుల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోనుంది. నయీం ఆస్తుల్ని అటాక్ చేసేందుకు ఐటి శాఖ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోరుతూ ఢిల్లీలోని అడ్జ్యుటికేటింగ్ అథారిటీలో ఐటీ అధికారులు ఇది వరకే పిటీషన్ దాఖలు చేశారు. ఆదాయ మార్గం లేకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంతో సిట్ నిర్వహించిన ఆధారాల మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. తెలంగాణలోని ఆయా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ,ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. అరెస్టు సమయంలో నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం జరిగిన సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా గ్యాంగ్ స్టర్ కు 1015 ఎకరాల భూములు..1,67,117 చదరపు అడుగుల ఇళ్ళస్ధలాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఎన్ కౌంటర్ తరువాత హైదరాబాద్ లోని నయీం డెన్ లో నిర్వహించిన సోదాల్లో 2.08 కోట్ల నగదు,1.90 కిలోల బంగారు ఆభరణాలు,258 సెల్ ఫోన్ లు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఉన్న 203 ఒరిజినల్ రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ లో పేలుడు పదార్ధాలు ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.