English | Telugu

మాజీ మంత్రి నాయని నర్సింహా రెడ్డి పరిస్థితి ఆందోళనకరం.. కుటుంబంలో మరో ముగ్గురికి కరోనా 

తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత నాయని నర్సింహా రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. నాయని నర్సింహా రెడ్డికి గత నెల 28వ తేదీన కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరి దాదాపు 16 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అయితే వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో ఇక ఇంటికి వస్తారని అనుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యూమోనియా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో నర్సింహా రెడ్డి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో.. ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనను ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి లో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా నాయని కుటుంబంలో మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది. అయన సతీమణి అహల్య కూడా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆమెకు నెగెటివ్ వచ్చింది . ఇక నాయని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పోరేటర్ వి. శ్రీనివాస రెడ్డికి, ఆయన పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకాగా వారు కోలుకుంటున్నారు.