English | Telugu

21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్: ప్రధాని మోడీ

ఈ రోజు రాత్రి 12 గంటలనుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని ప్రధాని ఎల్లడించారు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు దేశమంతా ఒక్కతాటిగా నిలిచిందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. జాతిని ఉద్దేశించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. జనతా కర్ఫ్యూను మనసా వాచా పాటించారంటూ దేశ ప్రజలను అభినందించిన మోడీ, దేశానికి ఇది పరీక్ష సమయమని, సామాజిక దూరం అనేది ప్రతి ఒక్కరూ పాటించటమే కరోనా వైరస్ విసిరే సవాల్ కు అసలైన జవాబు అన్నారు మోడీ. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి, సామాజిక దూరం పాటించాలని, ఈ లాక్ డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికీ లక్ష్మణ రేఖ లాంటిదని , అందువల్ల ఇది విధిగా పాటించాలనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 14 వరకూ అమల్లో ఉండే ఈ లాక్ డౌన్ కాలం లో ఇళ్ల నుంచి వెలుపలకు రావద్దని ఆయన సూచించారు. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి వీధి లాక్ డౌన్ లో ఉంటుందని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణమని అభివర్ణించిన నరేంద్ర మోడీ, సామాజిక దూరం అనేది ప్రధాని తో సహాఅందరూ పాటించాల్సిన విషయమన్నారు.