English | Telugu

కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో!

పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ ను ఏపీ ప్రభుత్వం సవరించింది. పెట్రోల్ పై రూ. 1.24, డీజిల్‌ పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్‌ పై 31 శాతం పన్నుతో పాటు రూ.4 అదనపు సుంకం, డీజిల్‌ పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 అదనంగా సుంకం విధించింది. లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసారు. పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే." అని లోకేష్ విమర్శించారు.

ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో! అంటూ సీఎం జగన్ పై లోకేష్ వ్యంగాస్త్రం సంధించారు.