English | Telugu
వరవరరావుకు సీరియస్.. చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండేలా చూడండి
Updated : Jul 21, 2020
వరవరరావు ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, మరికొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉందని సుదీప్ అన్నారు. కనీసం చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండేలా చూడాలని విన్నవించారు. ఈ వయసులో ఆయన విచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఏమాత్రం లేవని చెప్పారు. ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు కూడా భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు.
కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని తమకు పారదర్శకంగా తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన భార్య, కూతుర్లు డిమాండ్ చేశారు. "వరవరరావు తనకు తానుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. ఆయనకు సహకరించడానికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని తోడుగా ఉండేలా చూడండి." అని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ అందుబాటులో ఉంచాలని, బెయిల్ తీసుకోవడానికున్న అడ్డంకులన్నీ తొలగించాలని కోరారు.
అయితే, కరోనా రోగుల్ని కలిసేందుకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు అంగీకరించవని ఎన్‌ఐఏ తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దీపక్ థాకరే వాదనలను వినిపిస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, నిర్దిష్ట దూరం నుంచైనా వరవరరావును కుటుంబసభ్యులు చూసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.