English | Telugu
జగన్ తో ముకేష్ అంబానీ భేటీ.. అజెండా ఇదేనా!
Updated : Feb 29, 2020
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇవాళ అమరావతికి వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముకేష్... సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ముకేష్ తో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ కూడా జగన్ తో భేటీ అయ్యారు. ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ముకేష్, జగన్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుపతిలో రిలయన్స్ సంస్ధ నిర్మించ తలపెట్టిన 15 వేల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తరలిపోతుందన్న ప్రచారం మధ్య అంబానీ- జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి రానున్న తరుణంలో వీరిద్దరి భేటీలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశముంది.
మరోవైపు సుదూర తీర ప్రాంతం ఉన్న ఏపీ రిలయన్స్ పలు చోట్ల చమురు వెలికితీత చేపడుతోంది. ముఖ్యంగా కేజీ బేసిన్ లో రిలయన్స్ గ్యాస్, చమురు నిక్షేపాలను వెలికితీస్తోంది. వీటిని ఏపీకి కాకుండా గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాలకు పైప్ లైన్ ద్వారా తరలిస్తోంది. ఇందులో ఏపీకి కూడా వాటా ఇవ్వాలని జగన్ తండ్రి వైఎస్ కూడా గతంలో పట్టుబట్టారు. ఇప్పుడు జగన్ కూడా రిలయన్స్ అధినేతను ఈ మేరకు కోరే అవకాశాలూ లేకపోలేదు.
మరోవైపు జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు అంబానీ అమరావతికి వచ్చి అప్పటి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో అంబానీ జగన్ తో భేటీ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విద్యుత్ ఉత్పాదక రంగంలోనూ రిలయన్స్ రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తోంది. రియలన్స్ పవర్ కు చెందిన పలు ధర్మల్ ప్లాంట్ల నుంచి జెన్ కో ఇప్పటికే విద్యుత్ ను తీసుకుంటోంది. వీటి విస్తరణకు కూడా అంబానీ-జగన్ భేటీలో చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు.