English | Telugu

గ్రేటర్ చిత్రం.. తల్లిని ఓడించిన కొడుకు

'శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్ళ రూపంలో మన ఇంట్లోనే ఉంటారు' అని 'అఆ' సినిమాలో రావు రమేష్ అంటాడు. ఇప్పుడు ఇదే డైలాగ్ ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ టీఆర్ఎస్ అభ్యర్థి మరోలా అనుకుంటున్నారు. అదేంటంటే.. 'శత్రువులు ఎక్కడో ఉండరు.. కొడుకుల రూపంలో మన ఇంట్లోనే ఉంటారు'. పాపం ఆ టీఆర్ఎస్ అభ్యర్థి అలా ఎందుకు అనుకోవాల్సి వచ్చిందో తెలియాలంటే జరిగిన విషయం తెలుసుకోవాలి.

హయత్‌నగర్‌ సర్కిల్‌ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముద్దగౌని లక్ష్మీప్రసన్నగౌడ్‌ బరిలోకి దిగారు. అయితే విచిత్రంగా, డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్షీప్రసన్నగౌడ్‌ కుమారుడు రంజిత్‌గౌడే ఆమె ఓటమికి కారణంగా నిలిచారు. అదెలా అంటే, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో లక్ష్మీప్రసన్నగౌడ్‌ బీజేపీ అభ్యర్థి మొద్దు లచ్చిరెడ్డి చేతిలో 32 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు. స్వతంత్ర అభ్యర్థి రంజిత్‌గౌడ్‌ కు 39 ఓట్లు పోలయ్యాయి. రంజిత్‌ ముందే విత్‌ డ్రా చేసి ఉంటే బ్యాలెట్‌ పత్రంలో ఆయన పేరు కన్పించేది కాదు. అప్పుడు, ఆయనకు పోలైన 39 ఓట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నకు పడి ఉండేవని, ఆమె విజయం సాధించి ఉండేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, డమ్మీ అభ్యర్థిగా బరిలోకి దిగి మమ్మీ ఓటమికి కారణమైన రంజిత్‌ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు.