English | Telugu

టీఆర్ఎస్ ను హైదరాబాద్ లో వచ్చిన వరదలే ముంచేశాయా..? 

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో సొంత బలంతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకున్న టీఆర్ఎస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2016 లో జరిగిన ఎన్నిక‌లలో ఒక్క సీటుతో సెంచ‌రీ మిస్ అయిన టీఆర్ఎస్… ఏమైనా సరే ఈసారి సెంచ‌రీ పూర్తి చేస్తామ‌ని కేసీఆర్, కేటీఆర్ చెబుతూ వచ్చినా.. హాఫ్ సెంచరీ పైన ఐదు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే టిఆర్ఎస్ తాజా పరిస్థితికి ప్రధాన కారణం హైద‌ర‌బాద్ లో వచ్చిన వ‌ర‌దలేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నగరంలో వరదలకు తీవ్రంగా ప్రభావితమైన ఎల్బీన‌గ‌ర్ జోన్ తో పాటు పాత‌బ‌స్తీకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ ప‌రిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీకి తీవ్ర న‌ష్టం జరిగింది. వరద వచ్చిన సమయంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని స్థానిక ప్ర‌జ‌లు నిల‌దీయ‌గా… హ‌య‌త్ న‌గ‌ర్ కార్పోరేట‌ర్ పై మహిళలు దాడి చేసిన ఘటనలు మనం చూసాం. తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాలలో లోనూ ఇదే విషయం స్పష్టమవుతోంది.

ఈ ఎన్నికలలో స్వ‌యంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య ఓడిపోగా, వర‌ద ముంచెత్తిన ఎల్బీన‌గ‌ర్ జోన్ లోని మెజారిటీ స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది. అంతేకాకుండా టీఆర్ఎస్ స‌ర్కార్ వ‌ర‌ద స‌హాయం కింద కుటుంబానికి 10వేలు పంపిణి చేసినా.. కొంత మంది కింది స్థాయి టీఆర్ఎస్ నేతల చేతివాటంతో నిజమైన లబ్దిదారులకు ఆ సాయం చేరకపోవడంతో.. చాలా మంది తమకు ఎటువంటి సాయం అందలేదని ఆందోళన చేసిన సంగతి తెల్సిందే. జిహెచ్ఎంసి ఎన్నికలు ప్రకటించిన తరువాత కూడా వరద సాయం కోసం ప్రజలు మీసేవ వద్ద బారులు తీరిన విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వరద సాయం కూడా ఆ పార్టీని దెబ్బ తీసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.