English | Telugu
అన్యాయం జరిగితే కోర్టుకెళ్లొచ్చు... అమరావతి రైతులపై బొత్స ఘాటు కామెంట్స్
Updated : Dec 30, 2019
హైదరాబాద్‌ను తలదన్నే నగరాన్ని నిర్మించాలంటే... ఒక్క విశాఖలోనే సాధ్యమని మంత్రి బొత్స అన్నారు. విశాఖకు కొంచెం తోడ్పాటునిస్తే... దేశంలోనే మహానగరంగా మారుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పది నగరాల్లో వైజాగ్ ఒకటన్న బొత్స... ఏపీ రాజధానికి సరైన ప్రాంతం విశాఖ మాత్రమే అన్నారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్‌ను తలదన్నేలా మార్చుకోవచ్చన్నారు. కేవలం పదివేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.... హైదరాబాద్‌ను మించిన నగరంగా విశాఖ తయారవుతుందన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సామానంగా అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా అంటూ బొత్స ప్రశ్నించారు. రాజధానిని మారిస్తే కేంద్రం, బీజేపీ ఊరుకోదని కొందరంటున్నారని... మోడీ ఏమైనా మీ చెవిలో చెప్పారా అంటూ నిలదీశారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల మాటలు.... చంద్రబాబు మాటలూ ఒకే విధంగా ఉంటున్నాయని... మీరసలు బీజేపీ లీడర్లా లేక బాబు తొత్తులా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మారిస్తే కేంద్రానికి సమాచారమిస్తామన్న బొత్స.... నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
అయినా, మూడు రాజధానులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకుండానే రాద్ధాంతం చేయడం తగదన్నారు. జీఎన్‌రావు అండ్ బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ వేశామని, 21రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని అన్నారు. ఆ తర్వాత సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. అమరావతి రైతులు చంద్రబాబు మాటల్ని నమ్మి మోసపోవద్దన్న బొత్స.... ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లొచ్చన్నారు.