English | Telugu

 జనవరి 3న రాజధానుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసిన బిసిజి కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు మరియు ఇతర అంశాల పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, మంత్రి పేర్ని నానితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం డీజీపీ గౌతం సభ సీసీఎల్ పురపాలక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.

అవసరమైతే ఈ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవచ్చని సూచించారు. కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను కూడా విశ్లేషిస్తుంది. మూడు వారాల లోపు సిఫారసులతో కూడిన నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలనీ జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. దీంతో అమరావతి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అనంతరం క్యాబినెట్ సమావేశంలో అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక రావాలని.. ఆ తరువాత రెండు నివేదికలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. జనవరి 3వ తేదీన బిసిజి నివేదిక అందించనుంది. హైపవర్ కమిటీ దీనిని జీఎన్ రావు కమిటీ నివేదికను పరిశీలించి సిఫార్సు చేస్తోంది. వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి చట్టబద్ధంగా రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.