English | Telugu

పోలవరం ప్రాజెక్టు మళ్లీ మొదలు.. భూమి పూజ చేసిన మేఘా

మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరంలో భూమి పూజ చేసింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హై కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో మేఘా సంస్థ పనులు ప్రారంభించింది.స్పిల్ వే బ్లాక్ నెంబర్ 18 వద్ద భూమి పూజ నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని వనరులు ఉపయోగించి నిర్ణీత గడువు లోగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది మేఘా సంస్థ. కాళేశ్వరం లాంటి క్లిష్టమైన ప్రాజెక్టు నిర్మించిన అనుభవంతో ఆంధ్ర ప్రదేశ్ లోనూ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఇన్ని రోజులు పోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హై కోర్టు ఎత్తేయడంతో పనులు తిరిగి మొదలుపెట్టటానికి మార్గం సుగుమమైంది. పాత కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రివర్స్ టెండర్ కు వెళ్లి పోలవరం హెడ్ వర్క్స్ తో పాటు జల విద్యుత్ కేంద్రాలకు కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. హై కోర్టు ఉత్తర్వులతో ఏపీ ప్రభుత్వంతో మేఘా ఒప్పందం చేసుకుంది. గతంలో ఈ పనులు చేపట్టిన సంస్థలకంటే తక్కువ మొత్తానికి పనులు పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628 కోట్ల మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి 4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజినీరింగ్ ఒక్కటే 4,358 కోట్లు మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటానికి వడివడిగా అడుగులు వేస్తోంది.

పోలవరం ప్రాజెక్టుతో 7.2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. హైడల్ పవర్ ప్రాజెక్టుతో 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజి ఎగువ కృష్ణా నదికి తరలిస్తారు. 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం తాగు నీటి అవసరాల కోసం వినియోగిస్తారు. పోలవరం కాలువలు ఆనుకొని ఉన్నటువంటి 540 గ్రామాల్లో 28.5 లక్షల మందికి తాగునీటిని అందించనున్నారు.