English | Telugu
లలిత జ్యువెలరిలో భారి చోరి...
Updated : Oct 3, 2019
తమిళనాడు తిరుచ్చి లలిత జూలరీలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కిలో షోరూమ్ కి కన్నం వేసిన దొంగలు పదమూడు కోట్ల రూపాల విలువైన నగలు ఎత్తుకపోయారు. జంతువుల మాస్కులు పెట్టుకుని రెండు గంటల్లోనే ఈ దొంగతనం చేశారు. షోరూం వెనుక వైపు ఉన్న గోడకు కన్నం వేసి, పిల్లలు ఆడుకునే జంతువుల మాస్క్ లు పెట్టుకొని సిసి కెమెరాల కన్ను కప్పారు, అమ్మకాల కోసం బాక్సుల్లో ఉంచిన బంగారం, వజ్రాలు మూటగట్టుకున్నారు. ఇద్దరు అగంతకులు మొత్తం రెండు గంటల లోపే పదమూడు కోట్ల రూపాయలు విలువైన ఆభరణాలతో ఉడాయించారు.
తమిళనాడులోని తిరుచ్చి లోని లలితా జ్యువెలరి షోరూంలో అత్యంత సినీ ఫక్కీలో బుధవారం తెల్లవారుజామున ఈ భారీ దోపిడి జరిగింది. గత కొన్నేళ్లలో తమిళనాడులో జరిగిన అతిపెద్ద చోరీ ఇదే. విషయం తెలిసిన వెంటనే లలితా జ్యూయలరీ అధినేత కిరణ్ కుమార్ తిరుచ్చికి వెళ్లి షోరూంను పరిశీలించారు. బంగారు నగలతో పాటు వజ్రాలు, ప్లాటినంతో తయారు చేసిన ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు నిర్మితమయ్యాయి.
కిరణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలో ఉన్న లలితా జ్యువెలరి షోరూంని రోజులాగానే బుధవారం ఉదయం తెరిచారు. షోరూం లోపల ఖాళీగా ఆభరణాల బాక్సులు కనిపించే సరికి నిర్వాహకులు సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తిరుచ్చి నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాల కోసం ఫోరెన్సిక్ నిపుణులు చోరీ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాల్లో జాగిలాలతో తనిఖీ చేశారు. షోరూం లోని సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా వేకువ జామున రెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య షోరూంలో రెండు అగంతకులు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారు తమ చేతి వేలి ముద్రలు కూడా దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. దోచుకున్న నగలను ఏ మార్గంలో ఏ వాహనంలో తరలించారన్న విషయం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే షోరూంలో పని చేస్తున్న నూట అరవై మందికి పైగా సిబ్బంది వద్ద విచారణ జరుపుతున్నారు.
గతేడాది తిరుచ్చి ఒకటవ నెంబర్ టోల్ గేట్ సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుని ఇదే రీతిన కన్నం వేశారు. అప్పుడు బ్యాంక్ గోడకు కన్నం వేసి అగంతకులు లోపలకు ప్రవేశించి ఐదు కోట్ల విలువైన నగలను అపహరించారు. ఆ ఘటన లలితా జువెలర్స్ లో దోపిడీ జరిగిన విధానం ఒకేలా ఉన్నాయని ఆ అగంతకులే ఈ దోపిడీ కి పాల్పడి ఉంటారనే కోణం లోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.