English | Telugu
ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్ట్ పై ఆందోళన...
Updated : Oct 3, 2019
అమరావతిలో హైకోర్టు ఏర్పాటై నిండా తొమ్మిది నెలలైనా కాలేదు. దానిని తమ ప్రాంతానికి తరలించాలంటే తమ ప్రాంతానికి తరలించాలని అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిదేనని డిమాండ్ చేస్తోంది. హై కోర్టు తరలింపు పై పలుచోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి మద్దతుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు, తమ అభిప్రాయమేంటో చెప్పడం లేదు. దీనిపై హైకోర్టు అధికార వర్గాలు సైతం ప్రభుత్వమే స్పష్టం చేయాలని చెప్తున్నాయి.
ఏపిలో ప్రభుత్వం మారాక హైకోర్ట్ అమరావతి నుంచి తరలిపోతుందన్న ప్రచారం పెరిగిపోయింది. రాయలసీమకు హైకోర్టు తరలిపోనుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హైకోర్టును కర్నూలు లోనే పెట్టాలని రాయలసీమ వారు డిమాండ్ చేస్తున్నారు. కోస్తా ప్రజలు మాత్రం అమరావతిలోనే హైకోర్టు ఉండాలంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైకోర్టును కర్నూలులో పెడతామని బీజేపీ హామీ ఇచ్చింది. రాయలసీమలో హై కోర్టు బెంచి ఏర్పాటు చేస్తామని టిడిపి ప్రకటించింది. వైసిపి నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఇపుడు బిజెపి క్లారిటీగా చెబుతోంది కర్నూలులోనే హైకోర్టును ఏర్పాటు చేయాలంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనీ చెబుతోంది.
హైకోర్టును రాయలసీమకు తరలించే అంశంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలంటున్నారు కర్నూల్ బిజెపి నేతలు. హైకోర్టు ఇవ్వక పోతే సీమలు ఒక్క సీటు కూడా గెలవదు అంటున్నారు. సీమకు హైకోర్టు ను కేటాయించాలని అలా కాకపోతే రెండో రాజధానిగా కర్నూలును చెయ్యాలనే డిమాండ్స్ వినిపిస్తున్నారు బిజెపి నేతలు. లేదంటే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరిస్తున్నారు. అమరావతి రాజధాని అయినందున కర్నూలులోనే హైకోర్టును పెట్టాలంటున్నారు. మొత్తానికి హై కోర్టు తరలింపు ప్రచారం దుమారం రేపుతోంది. ఎవరికి వారు తమ ప్రాంతం లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. బిజెపి నేతలు మాత్రం అన్ని ప్రాంతాలూ అభివృద్ధి జరిగేలా హైకోర్టును కర్నూలు లోనే ఏర్పాటు చేయాలంటున్నారు. గట్టి గానే తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది.