English | Telugu
సీఎం భార్య భారతితో నమ్రత భేటీ!!
Updated : Oct 25, 2019
ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతితో, సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత భేటీ అయ్యారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ‘గ్రామం ఫౌండేషన్’ పేరుతో గ్రామంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులను భారతికి నమ్రత వివరించారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు నమ్రత ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలుస్తోంది.
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లి భారతితో నమ్రత భేటీ అయ్యారు.తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. అంతకు ముందు నమ్రత విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా, మహేష్ బాబు తండ్రి, సినీ నటుడు కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించారు. కొత్తగా కొన్నింటికి శ్రీకారం చుట్టారు. ఈ గ్రామ అభివృద్ధి బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు.