English | Telugu
మోడీని కలవనున్న ఎల్వీ.. జగన్ అనుమానమే నిజమైందా?
Updated : Nov 8, 2019
ఏపీ ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. అయితే ఎల్వీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. మరోవైపు ఎల్వీని బదిలీ చేసిన విధానం సరైంది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఎల్వీ బదిలీని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రధాని మోడీని కలవనున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎల్వీ మోడీతో భేటీ అయ్యే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి మోడీని కలవనున్నారని సమాచారం.
ఎల్వీ మోడీని కలవనున్నారనే వార్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎల్వీకి ఆరెస్సెస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన ఏపీలో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ.. ఆరెస్సెస్, బీజేపీలకు చేరుస్తున్నారన్న అనుమానంతోనే.. ఆయన్ని సీఎస్ పదవి నుంచి జగన్ తప్పించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సీఎస్ మోడీని కలబోతున్నారన్న వార్తలు ఒక్కసారిగా హీట్ పెంచాయి. సీఎస్ మోడీని కలిసి ఏం చెప్పబోతున్నారు? ఏపీ సర్కార్ ని ఇరుకున్న పెట్టే పని ఏమైనా చేయబోతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎల్వీకి మరో ఐదు నెలల సర్వీసు ఉంది. దాంతో ఆయనను కేంద్రం తన సేవలకు వినియోగించుకోనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలే తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవట్లేదు. మరి ఇప్పుడు ఎల్వీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సర్కార్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో చూడాలి.