English | Telugu

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. మధ్య తరగతిపై భారం

మధ్య తరగతిపై మరో భారం పడింది, గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. గత ఆరేళ్ళలో ఇదే భారీ పెంపు, దీంతో మధ్యతరగతిపై ఖర్చులు మరింత పెరగనున్నాయి. వంట గ్యాస్ ధర ఒకే సారి రూ. 144పెరిగింది. దీంతో 714 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర 858 రూపాయలకు చేరింది. అయితే కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచింది, రాయితీ గతంలో 153.86 కాగా ఇప్పుడది 291 రూపాయలకు పెరిగింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు రాయితీని 174.86 నుంచి 312.48 పెంచింది.

2014 జనవరి తర్వాత వంట గ్యాస్ ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల మార్పే తాజా ధరల పెంపుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఎల్పీజీ ధరలను సమీక్షిస్తూ ఉంటారు కానీ, ఈసారి దాదాపు రెండు వారాలు ఆలస్యం అయ్యింది. రాయితీని భారీగా పెంచుతున్న కారణంగా అనుమతుల ప్రక్రియలో జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు.

అయితే ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ధరల పెంపును వాయిదా వేశారన్న ఆరోపణలు వినిపించాయి. తాజా పెంపుతో ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన ఇండియన్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో 144 రూపాయలు పెరగ్గా ముంబైలో 145 రూపాయలు, కోల్ కతాలో 149 రూపాయలు పెరిగింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడంతోనే ధరలు పెరిగినట్టు కంపెనీలు చెబుతున్నాయి. ప్రతి యేడాది ప్రభుత్వం పన్నెండు సిలిండర్ లకు రాయితీ అందిస్తోంది. ఈ రాయితీని డైరెక్ట్ గా ఎకౌంట్ లలో పడనుంది, అటు రాయితీలు పెంచడంతో పాటు ధరలు కూడా పెరిగాయి. బడ్జెట్ లో దీనికి ప్రభుత్వం నిధులు కేటాయించింది, అయితే నాన్ సబ్సిడీ సిలిండర్ లకు మాత్రం పెను భారం తప్పదు. ఓ వైపు ధరలు ఇటు రాయితీ పెంచినా, ప్రభుత్వ రాయితీని మించితే సగటు కుటుంబం పైన అధికంగా భారం పడనుంది. ఇలాగే పెంచుకుంటూ పోతే త్వరలో సిలిండర్ ధరలు వెయ్యి రూపాయలను అందుకుంటాయని అంటున్నారు. మొత్తంగా పెంపు నిర్ణయం పై పలు వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.