English | Telugu

ఎస్ బ్యాంకు లో ఇరుక్కుపోయిన  పూరీ జగన్నాధుడి సొమ్ము

547 కోట్ల రూపాయల ఫండ్స్ వెనక్కు రావటం కష్టమే

పూరీ జగన్నాధ స్వామి కి కష్టమొచ్చి పడింది. దాదాపు 547 కోట్ల రూపాయల సొమ్ము ప్రస్తుతం ఎస్ బ్యాంక్ లో ఇరుక్కుపోయింది. పూరీ దేవస్థానం ఆ సొమ్మును ఎస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం ఎస్ బ్యాంక్ నుంచి ఉపసంహరణ పరిమితి 50 వేల రూపాయలకే కుదించటం తో, ఇపుడు పూరీ ఆలయం డిపాజిట్ల పరిస్థితి అగమ్యగోచరం గా తయారైంది. వాస్తవానికి పూరీ ఆలయం డిపాజిట్లు ఈ నెలలో మెట్యూరిటీ అవుతాయి కాబట్టి, ఆ భారీ మొత్తాన్ని ఉపసంహరించాలని కిందటి నెలలో జరిగిన ఆలయ బోర్డు సమావేశం లో తీర్మానం చేశారు. ఆ తర్వాత ఆ ఫండ్స్ ని జాతీయ బ్యాంక్ లలో డిపాజిట్ చేయాలని కూడా ఆలయ బోర్డు నిర్ణయించింది.

ఎస్ బ్యాంక్ ఇప్పటికే ఈ విషయమై ఆలయ బోర్డుకు ఒక లేఖ రాస్తూ, మార్చ్ 19, 23, 29 తేదీలలో ఫండ్స్ ఆలయ బోర్డుకు వెనక్కు పంపిస్తామని స్పష్టం చేసింది. కానీ, తాజాగా ఆర్ బీ ఐ తీసుకున్న నిర్ణయం తో, ప్రస్తుతం ఎస్ బ్యాంక్ ఈ 547 కోట్ల రూపాయల నిధులను ఆలయ బోర్డుకు వెనక్కు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ వ్యవహారంతో అసలు అంత పెద్ద మొత్తం నిధులను ఒక ప్రయివేట్ బ్యాంక్ లో ఎలా డిపాజిట్ చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఏ పరిస్థితుల్లో ఎస్ బ్యాంక్ లో ఆ ఫండ్స్ ని డిపాజిట్ చేయాల్సి వచ్చిందనే కోణం లో ఒక విచారణ చేపట్టాలని కూడా పూరీ ఆలయ కమిటీ సభ్యులు రామచంద్ర దాస్ మహాపాత్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.