English | Telugu
హైకోర్టు తీర్పును అమలు చేసి త్వరలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు!
Updated : Mar 2, 2020
మార్చి నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి
మార్చి నెలాఖరు నాటికి 14వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయకపోతే గ్రామపంచాయతీలకు రావాల్సిన 3 వేల 400 కోట్లకుపైగా నిధులు.. అలాగే పురపాలక సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఆగిపోతాయి. అందుకే నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి చేసే కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఏపీ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఆగిపోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఆఘ మేఘాలపై హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు . అయినా ఏపీలో వైసీపీ సర్కార్ 59.85 శాతం రిజర్వేషన్ల తో జీవో ఇవ్వడంతో టీడీపీకి చెందిన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది.
దీంతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లల్లో మార్పులపై సర్కార్ ఆగమేఘాలపై కసరత్తు ప్రారంభించింది.
గతంలో ఇచ్చిన జీవో మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లల్లో 09.85 శాతం మేర రిజర్వేషన్లు తగ్గించి, బీసీ రిజర్వేషన్లను 24.15 శాతానికి పరిమితం చేసే అవకాశం వుంది.
బీసీలకు 24.15 శాతం, ఎస్సీ, ఎస్టీలకు యధాతధంగా 19.08, 6.77 శాతాల మేర ఖరారయ్యే అవకాశం వుంది.
అయితే కోర్టు తీర్పుపై టిడిపి, వైసిపి నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో సమర్ధుడైన న్యాయవాదిని పెట్టకుండా ప్రభుత్వం కేసును నీరుగార్చిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్తే టీడీపీ కూడా ఇంప్లీడ్ అవుతుందని చంద్రబాబు అంటున్నారు. బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోవాలి, గ్రామీణ, పట్టాణాభివృద్ధి జరగకూడదు అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని బొత్స ఆరోపించారు.
జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలే కోర్టుకు వెళ్లారని వైసిపి ప్రతివిమర్శ చేసింది.
టీడీపీ కుట్ర కారణంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయాం. రిజర్వేషన్ల ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లో పూర్తిచేస్తాం'' అని బొత్స సత్యనారాయణ చెప్పారు.