English | Telugu
రావాలి జనం.. తాగాలి మద్యం! ఏపీలో ఇదే కొత్త నినాదం
Updated : Oct 20, 2020
లాక్‌డౌన్ కాలంలో మూతపడిన మద్యం షాపులను తిరిగి తెరిచినప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచింది. ఒకేసారి 75శాతం ధరలు పెంచి మందుబాబులకు షాకిచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రభుత్వం అనుకున్న దశలవారీ మద్య నిషేధ ప్రణాళిక అమలౌతోందని అందరూ భావించారు. కానీ 4 నెలలు తిరగకుండానే వెనకడుగు వేసింది జగన్ సర్కార్. మద్యం దొరక్క శానిటైజర్లు తాగుతున్నారని, ప్రభుత్వ ఆదాయం తగ్గిందనే కారణాలు చూపించి సెప్టెంబరు 3న ధరలను భారీగా తగ్గించేసింది. దీంతో అమ్మకాలు 50 శాతం పెరిగాయి. మే నుంచి ఆగస్టు వరకు నెలకు దాదాపు 12 లక్షల కేసుల లిక్కర్ అమ్మిన ఎక్సైజ్ శాఖ.. సెప్టెంబరులో ఒకేసారి 18.39 లక్షల కేసులు అమ్మేసింది. ఆగస్టు వరకు నెలకు సగటున 2.5 లక్షల కేసులు బీర్లు అమ్మిన ఎక్సైజ్‌శాఖ.. సెప్టెంబరులో 5.82 లక్షల కేసులు అమ్మేసింది. అక్టోబర్ లో మొదటి 15 రోజుల్లోనే దాదాపు పది లక్షల కేసుల లిక్కర్ అమ్మినట్లు సమాచారం. ఇది సెప్టెంబరు మాసం కంటే మరో లక్షన్నర కేసులు ఎక్కువ.
2019 అక్టోబర్ లో తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీలోనే లిక్కర్ ధరలు పెంచింది జగన్ సర్కార్. ముందుకు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది. కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చేవారు. ఇతర రాష్ట్రాల లిక్కర్ కొనుగోలుకు మందుబాబులు ఎగబడేవారు. అయితే ఆదాయం కోసమే సర్కార్ మద్యం ధరలు పెంచినా... విక్రయాలు తగ్గడంతో తమకు అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోనే ధరలు పెంచామని గొప్పగా ప్రకటించుకుంది. దశల వారీగా షాపులను కూడా తగ్గిస్తూ.. పూర్తి మద్యపాన నిషేదం దిశగా వెళతామని చెప్పింది.
దశలవారీగా మద్యపాన నిషేదం చేస్తామని చెప్పిన ఏపీ సర్కార్.. తర్వాత జే టర్న్ తీసుకుంది. మద్యం ధరలను తగ్గించింది. ఇప్పుడు ఏపీలోనూ మద్యం తక్కువ ధరకే లభిస్తుండటంతో లోకల్ షాపుల్లోనే కొనుగోలు చేస్తున్నారు జనాలు. అనేక బ్రాండ్ల ధరలు ఒక్కో సీసాపై ఒకేసారి 30 నుంచి 70 రూపాయల వరకు తగ్గిపోవడంతో మందుబాబులు ఎడాపెడా తాగేస్తున్నారు. ఏపీలో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. దీంతో దశల వారీగా మద్య నిషేదంపై జగన్ వైఖరి మారిందా... ఏపీలో ఇక మద్య నిషేదం లేనట్టేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మాట తప్పం.. మడమ తిప్పమనే వైసీపీ నేతలు ఇప్పుడేం చెబుతారని పలువురు నిలదీస్తున్నారు.