English | Telugu
ఎట్టకేలకు బీజేపీ అభ్యర్ధి అనౌన్స్... హుజూర్ నగర్ లో అసలు కమలం పరిస్థితేంటి?
Updated : Sep 28, 2019
హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే... ఈసారి ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అయితే, కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే, బీజేపీ మాత్రం అభ్యర్ధి ఎంపికకు టైమ్ తీసుకుంది. చివరికి, తర్జనభర్జనల అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న కోట రామారావును అభ్యర్ధిగా ప్రకటించారు.
మొన్నటివరకు ప్రభుత్వ వైద్యునిగా పనిచేసిన రామారావు... ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు నెలల కిందటే తన ఉద్యోగానికి రాజీనామాచేసి, బీజేపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అంతకుముందు ఏబీవీపీలో పనిచేసిన రామారావు... హుజూర్‌నగర్‌లో కాషాయ జెండా ఎగరవేయాలన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో విసిగిపోయిన ప్రజలు, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటోన్న కమలనాథులు... ఎట్టిపరిస్థితుల్లోనూ హుజూర్‌నగర్ లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామంటున్నారు. అయితే, 10 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... హుజూర్‌నగర్ లో బీజేపీ డిపాజిట్ సైతం కోల్పోయింది. కనీసం నోటాకి వచ్చిన ఓట్లు కూడా కాషాయ పార్టీకి రాలేదు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుని, 4 నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడంతో, అదే ఊపుతో, హుజూర్ నగర్‌లో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామన్న ధీమాలో కమలనాధులు ఉన్నారు. మరి హుజూర్‌నగర్ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.