English | Telugu

పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, కేశినేని

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పంచాయతీని పరిష్కరించేందుకు తెలుగుదేశం అధిష్ఠానం సమాయత్తమౌంది. ఇరువురినీ మంగళవారం (నవంబర్ 4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాల్సిందిగా తాఖీదులు జారీ చేసింది. ఇరువురినీ వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ విచారించి, వారి నుంచి వివరణ తీసుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.

గత నెలలో వీరిరువురూ బహిరంగంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలతో మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వీరి వ్యవహారం మీడియాలోనూ, రాజకీయవర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వీరిరువురినీ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇద్దరు నేతలు ఇచ్చే వివరణ ఆధారంగా వీరిపై చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి. దీంతోనైనా వీరిరువురి పంచాయతీకి తెరపడుతుందా? లేదా చూడాల్సి ఉంది.