English | Telugu
ఢిల్లీలో కేజ్రీవాల్ విజయానికి కారణాలేంటి?
Updated : Feb 11, 2020
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మహా యుద్ధాన్ని తలపించాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ సైన్యాన్ని మోహరించింది కమలదళం. 56 మంది కేంద్రమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపీలను యుద్ధక్షేత్రంలో నిలిపింది. దీనికితోడు ఆరెస్సెస్, వీహెచ్‌పీ కరసేవకులు. ఇంకోవైపు ఏకంగా నరేంద్ర మోడీ ప్రచారాన్ని హోరెత్తించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర వ్యూహాన్ని రచించారు. అటు కేజ్రీవాల్ మాత్రం తనే ఒక సైన్యంగా కదిలారు. దాంతో, ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ స్థాయిలో మోడీ వర్సెస్ కేజ్రీవాల్‌గా సాగాయి. ఇలా, మొత్తం కమలదళమంతా రంగంలోకి దిగినా... హిందుత్వ ఆయుధాన్ని ప్రయోగించినా... వీళ్లందరినీ సింగిల్ గా ఎదుర్కొని సూపర్ విక్టరీ కొట్టాడు కేజ్రీవాల్. కేవలం, తన ఐదేళ్ల పరిపాలననే ప్రజల ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లాడు. ముఖ్యంగా తాను అందించిన గుడ్ గవర్నెన్స్ నే ఎక్కువగా చెప్పుకున్నాడు. అదే, మరోసారి కేజ్రీవాల్ ను గెలిపించిందనేది స్పష్టంగా అర్ధమవుతోంది.
ముఖ్యంగా తన ఐదేళ్ల పాలనలో చేపట్టిన వివిధ పథకాలనే ప్రచారంలో ప్రజల ముందు పెట్టారు కేజ్రీవాల్. పేదలకు ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలందించే మొహల్లా క్లినిక్స్.... అలాగే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు... మహిళల భద్రత కోసం సీసీటీవీలు, వీధి దీపాలు... మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం... ఉచిత వైఫై.... అవీనీతి రహిత పాలన అందించానని చెప్పుకున్నారు. ఇలా తన పాలన గురించే చెప్పుకునే ఓట్లు అడిగారు కేజ్రీవాల్. ఇవే కేజ్రీవాల్ విజయానికి కారణమయ్యాయి.
మరోవైపు, మోడీ పౌరసత్వ ఆయుధాన్ని వదిలితే... స్వచ్చమైన నీటి సరఫరా చూడండి అన్నారు కేజ్రీవాల్. అమిత్ షా షహీన్ బాగ్ టెర్రరిస్టు అంటే... నిరంతరం కారుచౌకగా ఇస్తున్న కరెంటు చూడండి అంటూ ఓటర్లకు విన్నవించారు కేజ్రీ. ఆఖరికి మోడీ రామబాణం, హనుమాన్ ఆయుధం సంధించినా... కేజ్రీవాల్ మాత్రం, తన హయాంలో సకల సదుపాయాలతో నెలకొల్పిన సర్కారీ బడులను చూడండంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ తన బ్రహ్మాస్త్రమైన హిందూత్వకు సంబంధించిన సకల ఆయుధాలనూ సంధిస్తే.... కేజ్రీవాల్ మాత్రం, కేవలం తన సుపరిపాలన గురించి మాత్రమే వివరించారు. చివరికి, కేజ్రీవాల్ వాదన వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గుచూపారు. ఆమ్ ఆద్మీని మరోసారి ఆదరించి బంపర్ మెజారిటీతో పట్టంకట్టారు.